మా దేశంలో ఉన్న ఆ ఒక్క భారతీయ జర్నలిస్టు వెళ్లిపోవాల్సిందే: చైనా
ఒక్క భారతీయ జర్నలిస్టు కూడా చైనాలో ఉండొద్దని ఆ దేశ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో భారతీయ జర్నిస్టులను ఒక్కొక్కరిగా ఇండియాకు పంపేస్తోంది. జూన్ రెండో వారం నాటికి చైనాలో ఒక్క భారతీయ జర్నలిస్టు మాత్రమే ఉన్నారు. అయితే ఇప్పుడు ఆ ఒక్క జర్నలిస్టును కూడా దేశం విడిచి వెళ్లాలని బీజింగ్ ఆదేశించింది. ఈ నెలలోనే దేశం విడిచి వెళ్లాలని పీటీఐ రిపోర్టర్‌ను చైనా అధికారులు ఆదేశించారు. రెండు దేశాల మధ్య సంబంధాలు క్షీణిస్తున్న తరుణంలో అతని నిష్క్రమణ ప్రపంచంలోని రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ నుంచి భారతదేశ మీడియా ఉనికిని తుడిచివేయనుంది. ఈ చర్య ద్వారా ఇరు దేశాల మధ్య దూరం మరింత దూరం పెరిగే అవకాశం ఉంది.
ఈ ఏడాది ప్రారంభంలో చైనాలో నలుగురు భారతీయ జర్నలిస్టులు
ఈ ఏడాది ప్రారంభంలో చైనాలో భారత మీడియా సంస్థలకు చెందిన నలుగురు రిపోర్టర్లు ఉన్నారు. హిందూస్థాన్ టైమ్స్ రిపోర్టర్ గతవారం వెళ్లిపోయారు. పబ్లిక్ బ్రాడ్కాస్టర్ ప్రసార భారతి,ది హిందూ వార్తాపత్రికకు చెందిన జర్నలిస్టులకు ఏప్రిల్‌లో చైనాలో వీసా పునరుద్ధరణకు బీజింగ్ అధికారులు నిరాకరించారు. గతనెలలో, చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావో నింగ్ మాట్లాడుతూ, భారతదేశంలో ఒక చైనీస్ జర్నలిస్ట్ మిగిలి ఉన్నారని, అతను ఇంకా వీసా పునరుద్ధరణ కోసం వేచి ఉన్నాడని చెప్పారు. అంతకుముందు, జిన్హువా న్యూస్ ఏజెన్సీ, చైనా సెంట్రల్ టెలివిజన్‌కు చెందిన ఇద్దరు జర్నలిస్టుల వీసా పునరుద్ధరణ దరఖాస్తులను దిల్లీ తిరస్కరించింది. అయితే ఈ సమస్యపై ఇరు దేశాలు సంప్రదింపులు జరుపుతున్నాయని భారతదేశం చెప్పింది.