Page Loader
Donald Trump: ట్రంప్‌ రష్యా గూఢచారి అంటూ ఆరోపణలు.. అసలేం జరిగింది?
ట్రంప్‌ రష్యా గూఢచారి అంటూ ఆరోపణలు.. అసలేం జరిగింది?

Donald Trump: ట్రంప్‌ రష్యా గూఢచారి అంటూ ఆరోపణలు.. అసలేం జరిగింది?

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 04, 2025
03:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత, రష్యాతో సంబంధాలపై మళ్లీ వివిధ ఊహాగానాలు మొదలయ్యాయి. తాజాగా ఉక్రెయిన్‌ యుద్ధాన్ని త్వరగా ముగించేందుకు పుతిన్‌తో చర్చలు జరపడం, జెలెన్‌స్కీపై ఒత్తిడి పెంచడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో పలు మీడియా సంస్థలు ట్రంప్‌ గతంలో కేజీబీ గూఢచారి అని ఓ మాజీ సోవియట్‌ అధికారి చేసిన పోస్టును ప్రస్తావిస్తూ కథనాలు ప్రచురించాయి. మిర్రర్‌ పత్రిక కూడా ఈ ప్రచారాలను పేర్కొంటూ ఓ కథనం ప్రచురించడం విశేషం. ఉక్రెయిన్‌ యుద్ధంపై ట్రంప్‌ పుతిన్‌ను తీవ్రంగా విమర్శించకపోవడం, ఐరోపా దేశాలతో ఆయన దూరం పెరగడం వంటి అంశాలు ఈ వాదనలకు మరింత బలం చేకూర్చుతున్నాయి.

Details

1980ల్లో ట్రంప్‌ కేజీబీ ఏజెంటా?

1980ల్లో వ్యాపారవేత్తగా ఉన్న సమయంలో కేజీబీ ట్రంప్‌ను తమ ఏజెంటుగా నియమించుకుందని మాజీ సోవియట్‌ ఇంటెలిజెన్స్ అధికారి అల్నూర్‌ ముస్సాయేవ్‌ తన సోషల్‌ మీడియా పోస్టులో పేర్కొన్నారు. 1987లో ట్రంప్‌ను నియమించుకున్నట్లు ఆయన పేర్కొన్నప్పటికీ, దీనికి ఎటువంటి ఆధారాలు అందించలేదు. సోవియట్‌ యూనియన్‌ కూలిన తర్వాత ముస్సాయేవ్‌ కజకిస్థాన్‌ ఇంటెలిజెన్స్‌ శాఖలో పనిచేశారు. ట్రంప్‌ కోడ్‌నేమ్‌ 'క్రస్నోవ్‌'గా ఉండేదని ఆయన పేర్కొన్నారు. ట్రంప్‌కు సంబంధించిన కీలక సమాచారాన్ని రష్యా వశం చేసుకుని, ఆయనపై ప్రభావం చూపించేందుకు ప్రయత్నిస్తోందని ఈ వాదనలు సూచిస్తున్నాయి. మగువలు, ఆర్థిక సహాయం వంటి అంశాల ద్వారా పుతిన్‌ ట్రంప్‌ను నియంత్రిస్తున్నాడన్న ప్రచారం కూడా ఉంది.

Details

 జెలెన్‌స్కీపై ద్వేషం ఎందుకు?

2020 అధ్యక్ష ఎన్నికల సమయంలో ట్రంప్‌ ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీపై అసంతృప్తితో ఉన్నట్లు చెబుతున్నారు. ముఖ్యంగా బైడెన్‌ కుమారుడు హంటర్‌ ఉక్రెయిన్‌లో వ్యాపార వ్యవహారాల్లో భాగమైన వ్యవహారంపై దర్యాప్తు చేయాలని ట్రంప్‌ కోరిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో ఆయన లాయర్‌ రూడీ గులియానీ కీలక పాత్ర పోషించారు. అయితే ఈ వ్యవహారంపై జరిగిన ఫోన్‌కాల్‌ లీక్ కావడంతో వివాదాస్పదమైంది.

Details

రష్యా వ్యాపారవేత్తల మద్దతు?

ట్రంప్‌ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారానికి రష్యా కుబేరులు, వ్యాపారవేత్తలు, మాఫియా గుంపులు ఆర్థిక సహాయం అందించి ఉండొచ్చని ఓ మాజీ ఇంటెలిజెన్స్‌ అధికారి మిర్రర్‌ పత్రికకు వెల్లడించినట్లు చెబుతున్నారు. ఈ కారణంగా, ట్రంప్‌ను రష్యా నియంత్రించేందుకు ప్రయత్నిస్తోందన్న ఊహాగానాలు బలపడుతున్నాయి. గత వారం రోజులుగా పశ్చిమ దేశాల మీడియాలో ఈ అంశంపై కథనాలు వెలువడుతున్నాయి. అమెరికాలో డెమొక్రటిక్‌ పార్టీకి చెందిన బర్నీ శాండర్స్‌ వంటి నేతలు కూడా ఈ ఆరోపణలకు బలం చేకూర్చేలా ప్రకటనలు చేయడం ప్రారంభించారు. అమెరికా రాజకీయాల్లో ప్రత్యర్థులను రష్యా ఏజెంట్లుగా ముద్రవేయడం ఇదే తొలిసారి కాదు. గతంలో తులసీ గబార్డ్‌ కూడా ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొన్నారు.