USA: అమెరికా అధ్యక్ష ఎన్నికల రోజు ఉగ్రదాడికి కుట్ర.. ఆఫ్ఘన్ వ్యక్తి అరెస్టు
వచ్చే నెలలో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలు ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఈ సమయంలో, ఎన్నికల రోజున ఉగ్రదాడికి కుట్ర పన్నిన వ్యక్తిని యూఎస్ న్యాయశాఖ అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొంది. అధికారుల వివరాల ప్రకారం, 2021లో నాసిర్ అహ్మద్ తౌహేదీ (వయసు 27) ప్రత్యేక వలస వీసాతో అమెరికాకు ప్రవేశించాడు. ప్రస్తుతం అతను ఓక్లహోమా సిటీలో నివసిస్తున్నాడు. ఎన్నికల రోజున ఐఎస్‌ఐఎస్ పేరుతో ఉగ్రదాడి చేయాలని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాడు. అహ్మద్ కెమెరాలను యాక్సెస్ చేయడం, లైసెన్స్‌లు లేకుండా తుపాకులు దొరికే రాష్ట్రాల గురించి సోషల్ మీడియాలో పరిశోధించాడు. అందులో భాగంగా, అతను వైట్ హౌస్, వాషింగ్టన్ వెబ్ కెమెరాలను కూడా సందర్శించినట్లు సమాచారం.
రెండు ఏకే-47 రైఫిళ్లు, మందుగుండు సామగ్రిని కొనుగోలు
రెండు ఏకే-47 రైఫిళ్లు, మందుగుండు సామగ్రిని కొనుగోలు చేసినట్లు గుర్తించారు. అతడు పెద్దసంఖ్యలో గుమిగూడే వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని దాడి చేయాలని ప్రణాళిక వేసినట్లు విచారణలో వెల్లడించారు. ఆ సమయంలో అతను, అతని సహచరులు ఆత్మాహుతి దళంగా మారాలని అనుకున్నట్లు తెలిపారు. ''అమెరికా జాతీయ భద్రతకు ఐఎస్‌ఐఎస్, దాని మద్దతుదారుల నుండి వచ్చే ముప్పును సమర్థంగా ఎదుర్కొంటాం. ప్రజలను భయాందోళనలకు గురిచేసే వారిని గుర్తించి విచారిస్తాం'' అని యూఎస్ అటార్నీ జనరల్ మెరిక్ గార్లాండ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
అమెరికాలో దాడులు జరిగే అవకాశం: డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం నేపథ్యంలో అమెరికా ఇజ్రాయెల్‌కు మద్దతుగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ కారణంగా అమెరికాలో దాడులు జరిగే అవకాశం ఉందని డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ అంచనా వేసింది. ''ఇస్లామిక్ స్టేట్, ఆల్‌ఖైదా వంటి విదేశీ ఉగ్రవాద సంస్థలు అమెరికాలో దాడులు నిర్వహించాలని, ప్రేరేపించాలనే ఉద్దేశాలు ఉన్నాయి'' అని గత నెల విడుదల చేసిన నివేదికలో పేర్కొంది.