US President Election: 'సూపర్ ట్యూస్ డే' ఎన్నికల్లో ట్రంప్ హవా.. బైడెన్‌తో పోటీ దాదాపు ఖాయం
అమెరికాలో 'సూపర్ ట్యూస్‌డే' సందర్భంగా 16 రాష్ట్రాల్లో జరిగిన ప్రైమరీ ఎన్నికల ఫలితాల్లో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాత్మక విజయం సాధిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో 8 రాష్ట్రాల్లో ట్రంప్ విజయం సాధించారు. ట్రంప్ అన్ని రాష్ట్రాలను గెలుచుకునే దిశగా ముందుకుసాగుతున్నట్లు కనిపిస్తోంది. దీంతో రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని ఆశించిన నిక్కీ హేలీ రేసు నుంచి దాదాపు తప్పుకున్నట్లే అని చెప్పాలి. ప్రైమరీ ఎన్నికల్లో తాజా విజయంతో ఈ ఏడాది జరగనున్న అధ్యక్షల్లో పోటీ ట్రంప్- బైడెన్ మధ్య ఉంటుందనే స్పష్టమవుతోంది.
ఏఏ రాష్ట్రాల్లో ఎవరు గెలిచారు?
రిపబ్లికన్ ప్రైమరీ ఎన్నికల్లో అలబామా, అర్కాన్సాస్, మైనే, నార్త్ కరోలినా, ఓక్లహోమా, టేనస్సీ, టెక్సాస్, వర్జీనియాలో ట్రంప్ విజయం సాధించారని అమెరికా మీడియా పేర్కొంది. వెర్మోంట్‌లో నిక్కీ హేలీ విజయం సాధించారు. డెమోక్రటిక్ పార్టీ ప్రైమరీ ఎన్నికల్లో వర్జీనియా, అయోవా, నార్త్ కరోలినా, వెర్మోంట్, కొలరాడో, ఓక్లహోమా, టేనస్సీ, టెక్సాస్, అర్కాన్సాస్, మైనే, మసాచుసెట్స్, అలబామాలో బైడెన్ గెలిచారు. డెమోక్రటిక్ పార్టీలో అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం బైడెన్‌తో పాటు మారియన్ విలియమ్సన్, డీన్ ఫిలిప్స్ తలపడుతున్నారు. రిపబ్లికన్ పార్టీలో నిక్కీ హేలీ.. ట్రంప్‌కు పోటీ ఇస్తున్నారు.
చరిత్రలో అత్యంత చెత్త అధ్యక్షుడు బైడెన : ట్రంప్
ప్రైమరీ ఎన్నికల సందర్భంగా తన మార్-ఎ-లాగో రిసార్ట్‌లో ప్రజలను ఉద్దేశించి ట్రంప్ మాట్లాడారు. గత మూడేళ్లలో అమెరికా దేశం ఘోర పరాజయాలను చవిచూసిందన్నారు. తాను పదిలో ఉండి ఉంటే, రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరిగేది కాదన్నారు. ఇజ్రాయెల్ వివాదం వచ్చేది కాదన్నారు. వలసలను అరికట్టేవాడినని పేర్కొన్నారు. ఈ సందర్భంగా బైడెన్‌ను దేశ చరిత్రలో చెత్త అధ్యక్షుడిగా ట్రంప్ అభివర్ణించారు. ఇదిలా ఉంటే, అధ్యక్ష ఎన్నికలకు వేళ.. ట్రంప్‌కి అమెరికా సుప్రీంకోర్టు నుంచి పెద్ద ఊరట లభించింది. ట్రంప్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడంపై ఉన్న నిషేధాన్ని కోర్టు ఎత్తివేసింది.
సూపర్ ట్యూస్ డే అంటే ఏమిటి?
అమెరికాలో అధ్యక్ష ఎన్నికలకు ముందు ప్రధాన పార్టీలు తమ అధ్యక్ష అభ్యర్థులను ఎంపిక చేసుకుంటాయి. ఇందుకోసం రాష్ట్రాలలో ప్రైమరీ, కాకస్ ఎన్నికలు నిర్వహిస్తారు. మార్చి 5వ తేదీన గరిష్టంగా 16 రాష్ట్రాల్లో ఎన్నికలను నిర్వహించారు. భారీ స్థాయిలో ప్రైమరీ ఎన్నికలు నిర్వహించిన నేపథ్యంలో అందుకే దీనిని సూపర్ ట్యూస్‌డే అని పిలుస్తారు. అధ్యక్ష ఎన్నికల దృక్కోణం నుంచి ఈ రోజు చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఈ రోజున పెద్ద సంఖ్యలో ప్రతినిధులు తమ అభ్యర్థులను ఎన్నుకుంటారు. ఈ రోజుతే దాదాపు అభ్యర్థి ఎవరు అనేది తెలిసిపోతుంది.