Air India : ఇజ్రాయెల్‌కు ఎయిర్ ఇండియా విమాన సర్వీసులు బంద్.. కారణమిదే
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం కారణంగా మళ్లీ పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో భారత విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ కు విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు పేర్కొంది. తదుపరి ప్రకటన వచ్చేంతవరకు టెల్ అవీవ్ నుంచి రాకపోకలు సాగించే విమాన సర్వీసులు నిలిపివేస్తున్నట్లు తాజాగా ఎయిర్ ఇండియా ప్రకటించింది. యుద్ధ పరిస్థితులను సమీక్షించి తర్వాత సర్వీసుల పునరుద్ధరణపై నిర్ణయం తీసుకుంటామని చెప్పింది.
గతంలో విమాన సర్వీసులు నిలిపివేత
ఒకవేళ ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులు పూర్తి రీఫండ్ చేస్తామని పేర్కొంది. అంతకుముందు కూడా ఆగస్టు 2 నుంచి 8వ తేదీ వరకూ దిల్లీ-టెల్ అవీవ్ మధ్య విమాన సర్వీసులను నిలిపివేసింది. ఈ రెండు ప్రాంతాల మధ్య వారానికి నాలుగు సర్వీసులను ఎయిర్ ఇండియా నడుపుతోంది. గతంలో హమాస్ పై దాడి జరిపిన తర్వాత కూడా దాదాపు ఐదు నెలల పాటు టెల్ అవీవ్ కు విమాన సర్వీసులను ఎయిర్ లైన నిలిపి వేసిన విషయం తెలిసిందే.