Alabama: అలబామాలో ముగ్గురిని చంపిన వ్యక్తి.. నైట్రోజన్ గ్యాస్ తో మరణశిక్ష.. దేశంలోని రెండోసారి
అమెరికాలో నైట్రోజన్ గ్యాస్ ద్వారా మరణశిక్ష అమలు చేయడం ఇటీవల పెద్ద చర్చగా మారిన విషయం తెలిసిందే. తాజాగా, ఈ పద్ధతిలో రెండోసారి మరణశిక్ష అమలుచేశారు. పని ప్రదేశంలో ముగ్గురిని హత్య చేసిన కేసులో నేరస్తుడిగా తేలిన మిల్లర్ అనే వ్యక్తికి, గురువారం (అమెరికా కాలమానం ప్రకారం) అలబామా (Alabama)లో నైట్రోజన్ గ్యాస్ ద్వారా ఈ శిక్షను అమలు చేశారు. అలబామాలోని దక్షిణ జైలులో మిల్లర్ (59) ముఖానికి అధికారులు మాస్క్ బిగించి, నైట్రోజన్ గ్యాస్ ప్రవేశపెట్టడం ప్రారంభించారు. కేవలం రెండు నిమిషాల్లోనే మిల్లర్ కింద పడిపోయి, ఆరు నిమిషాల తర్వాత శ్వాస విడిచాడని అధికారులు తెలిపారు. మొత్తం 8 నిమిషాల్లో ఈ శిక్ష పూర్తయిందని వెల్లడించారు.
కెన్నెత్ స్మిత్ పై ఈ శిక్ష అమలు
అలబామాలో ఇదే పద్ధతిలో మరణశిక్ష అమలు చేయడం ఇది రెండోసారి. ఈ ఏడాది జనవరిలో కూడా హత్య కేసులో నేరస్తుడిగా ఉన్న కెన్నెత్ స్మిత్ (58)కి ఇదే విధానాన్ని అమలు చేశారు. అయితే, ఈ పద్ధతి పై పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతోంది. కెన్నెత్ శిక్ష అమలు ముందు అతని తరఫు న్యాయవాదులు దీని వ్యతిరేకంగా పోరాడారు, కానీ కోర్టులో విజయం సాధించలేకపోయారు. అంతేకాక, శిక్ష అమలు అప్పుడు అతడు తీవ్రమైన నరకయాతన అనుభవించాడని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు.
ఏంటీ మిల్లర్ కేసు..
మిల్లర్ కేసు విషయంలో, 1999లో మూడు హత్యలకు పాల్పడినందుకు అతడికి మరణశిక్ష విధించారు. డెలివరీ ట్రక్కు డ్రైవర్‌గా పనిచేస్తున్న మిల్లర్ 1999 ఆగస్టు 5న తన సహచర ఉద్యోగులైన హోల్డ్‌బ్రూక్స్, యాన్సీలను విచక్షణారహితంగా కాల్చి చంపాడు. అనంతరం, అతను పూర్వ ఉద్యోగి అయిన జార్విస్‌ను కూడా హత్య చేశాడు. అతడి మానసిక స్థితి సరిగా లేకపోవడం, సహోద్యోగులు తనపై వదంతులు సృష్టిస్తున్నారని అనుమానంతో ఈ హత్యలకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది. 2022లో విషపూరిత ఇంజెక్షన్ ద్వారా మరణశిక్ష అమలు చేయాలని ప్రయత్నించగా, అతని అధిక బరువు కారణంగా నరాలు దొరక్కపోవడంతో అది విఫలమైంది. చివరికి నైట్రోజన్ గ్యాస్ ద్వారా శిక్షను అమలు చేశారు.