
Anthony Albanese: రెండోసారి ప్రధానిగా ఆల్బనీస్.. భారత్-ఆస్ట్రేలియా బంధం మరింత బలపడనుందా?
ఈ వార్తాకథనం ఏంటి
ఆస్ట్రేలియా ప్రధానిగా ఆంథోనీ ఆల్బనీస్ వరుసగా రెండోసారి గెలుపొందారు.
శనివారం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆయన నేతృత్వంలోని లేబర్ పార్టీ విజయభేరి మోగించింది. ఈ విజయంతో 2004 తర్వాత మొదటిసారిగా వరుసగా రెండోసారి అధికారం చేపట్టిన ప్రధానిగా ఆల్బనీస్ రికార్డు సృష్టించారు.
ఆయన మరో మూడేళ్లపాటు పదవిలో కొనసాగనున్నారు. ప్రతిపక్ష నేత పీటర్ డట్టన్ ఓటమిని అంగీకరించారు. తమ పార్టీ ఈ ఎన్నికల్లో తగిన విధంగా ప్రభావాన్ని చూపలేకపోయిందని తెలిపారు.
ప్రతినిధుల సభలో మొత్తం 150 స్థానాలకు శనివారం ఎన్నికలు జరగ్గా, ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నప్పటికీ లేబర్ పార్టీ ఇప్పటికే 86 స్థానాల్లో విజయం సాధించి మెజార్టీ మార్క్‌గా ఉన్న 76 స్థానాలను అధిగమించింది.
Details
శుభాకాంక్షలు తెలిపిన మోదీ
ఓటింగ్ అనంతరం లేబర్ పార్టీకి అధికారం మళ్లీ లభించే అవకాశాలపై అంచనాలు వ్యక్తమయ్యాయి. 2022లో ప్రధాని పదవిని స్వీకరించిన ఆల్బనీస్ ఇప్పుడీ విజయంతో మళ్లీ మూడేళ్లపాటు ఆ పదవిలో కొనసాగనున్నారు.
తన విజయ ప్రసంగంలో ఆయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు కొనసాగుతున్న ఈ సమయంలో ఆస్ట్రేలియన్లు ఆశావాదాన్ని, సంకల్పబలాన్ని ఎంచుకున్నారని పేర్కొన్నారు.
ఆల్బనీస్‌కు భారత ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. 'ఆస్ట్రేలియా ప్రధానిగా మరోసారి ఎన్నిక కావడం అభినందనీయం. ఈ తీర్పు మీ నాయకత్వంపై ప్రజల విశ్వాసాన్ని ప్రతిబింబిస్తోంది.
భారత్-ఆస్ట్రేలియా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలపర్చేందుకు, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం కోసం కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నాని అంటూ మోదీ 'ఎక్స్'లో పోస్ట్ చేశారు.