LOADING...
Aliens spying on Earth: భూమి అణు కేంద్రాలపై 85 ఏళ్లుగా ఎలియన్లు నిఘా? కలకలం రేపుతున్న కొత్త పరిశోధన !
కలకలం రేపుతున్న కొత్త పరిశోధన !

Aliens spying on Earth: భూమి అణు కేంద్రాలపై 85 ఏళ్లుగా ఎలియన్లు నిఘా? కలకలం రేపుతున్న కొత్త పరిశోధన !

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 29, 2025
05:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

భూమిపై ఎలియన్లు గమనిస్తారన్న అనుమానాలు, కుట్ర సిద్ధాంతాలు చాలాకాలంగా వినిపిస్తున్నాయి. అయితే తాజాగా వెలువడిన ఒక పరిశోధన ఈ అనుమానాలకు కొత్త మలుపు తీసుకొచ్చింది. ఈ అధ్యయనంలో, మానవుల కృత్రిమ ఉపగ్రహాలు అంతరిక్షంలోకి వెళ్ళకముందే, ఏదో ఒక శక్తి భూమిపై ఉన్న అణు పరీక్షా కేంద్రాలను గమనిస్తున్నట్లు సాక్ష్యాలు లభించాయని పరిశోధకులు చెబుతున్నారు. స్వీడన్‌లోని నార్డిక్ ఇన్స్టిట్యూట్ ఫర్ థియరీటికల్ ఫిజిక్స్‌కు చెందిన డాక్టర్ బియాట్రిజ్ విల్లారోయెల్ నేతృత్వంలో జరిగిన ఈ అధ్యయనంలో, 1949 నుంచి 1957 మధ్యకాలంలో జరిగిన అణు పరీక్షల సమయంలో ఆకాశంలో విచిత్రంగా కనిపించిన ప్రకాశవంతమైన బిందువులు.. అంటే "ట్రాన్సియెంట్స్".. గణనీయంగా పెరిగినట్లు తేలింది.

వివరాలు 

అణు పరీక్షలు జరిగిన రోజుల్లో 8.5 శాతం పెరిగిన మొత్తం ట్రాన్సియెంట్స్ సంఖ్య 

ఇవి సహజంగా ఏర్పడిన వస్తువులు కావని, అవి బలమైన ప్రతిబింబాన్ని ఇస్తున్నాయని, కొన్నిసార్లు చక్రంలా తిరుగుతున్నట్లుగా కనిపించాయని విల్లారోయెల్ వివరించారు. ఈ పరిశోధనను ఇతర శాస్త్రవేత్తలు కూడా సమీక్షించి అంగీకరించారు. సాధారణంగా ఇలాంటి UAPs (Unidentified Anomalous Phenomena) గురించి వచ్చిన పత్రాలను శాస్త్ర సమాజం తిరస్కరించినప్పటికీ, ఈ నివేదిక మాత్రం గణనీయంగా గుర్తింపు పొందింది. పరిశోధకుల ప్రకారం, ఆ "ట్రాన్సియెంట్స్" అనే రహస్య వస్తువులు అణు పరీక్షల ముందు లేదా తర్వాత 45 శాతం ఎక్కువగా కనిపించాయని తేలింది. అంతేకాక, అణు పరీక్షలు జరిగిన రోజుల్లో మొత్తం ట్రాన్సియెంట్స్ సంఖ్య 8.5 శాతం పెరిగిందని వివరించారు.

వివరాలు 

అణు పరీక్షలు జరిగిన రోజుల్లో కక్ష్యలో 60 రహస్య వస్తువులు 

వారి పరిశీలనలో మొత్తం 1 లక్షకు పైగా ట్రాన్సియెంట్స్ నమోదు కాగా, వాటిలో 35 వేలకుపైగా ఉత్తరార్ధగోళంలోనే ఉన్నాయని చెప్పారు. ముఖ్యంగా అణు పరీక్షలు జరిగిన రోజుల్లో 60 రహస్య వస్తువులు కక్ష్యలో కనిపించాయని, వాటిని UFOsగా కూడా పలువురు చూశారని పేర్కొన్నారు. "ఇవి స్పుట్నిక్-1కి ముందే కనిపించిన వస్తువులు. ఆ సమయంలో మనుషులు అంతరిక్షంలో ఏదీ పంపలేదు. కానీ ఇవి అద్దంలా ప్రతిబింబించేలా, బలమైన తిప్పు గుణంతో కనిపిస్తున్నాయి. సహజంగా ఇలాంటి వాటిని నేను ఎప్పుడూ చూడలేదు," అని డా. విల్లారోయెల్ అన్నారు. ఈ అధ్యయనం అమెరికాలోని పాలోమార్ ఆబ్జర్వేటరీ స్కై సర్వేలో పాత ఫోటోల ఆధారంగా రూపొందించబడింది.

వివరాలు 

కొంతసేపు మాత్రమే కనిపించి మాయమైన వస్తువులు

అమెరికా, బ్రిటన్, సోవియట్ యూనియన్‌లు పైభూమిపై నిర్వహించిన 124 అణు పరీక్షల సమయంలో తీసిన చిత్రాలను పరిశీలించగా, ఆ ఫోటోలలో కొంతసేపు మాత్రమే కనిపించి మాయమైన వస్తువులు గుర్తించారు. ఆ కాలంలో మానవులు అంతరిక్షంలో ఏ ఉపగ్రహం లేదా పరికరం పంపలేదని గమనించారు. "ప్రకృతి ఎప్పుడూ మన ఊహకు మించి ఏదైనా చూపిస్తుంది. కానీ ప్రస్తుతం నాకు కనిపిస్తున్న దాని ప్రకారం, ఇవి సహజమైనవి కాదని మాత్రమే చెప్పగలను," అని విల్లారోయెల్ పేర్కొన్నారు. ఈ వస్తువులు ఇప్పటికీ ఉన్నాయా అనే విషయాన్ని నిర్ధారించలేకపోయినా, అవి మానవేతర మేధస్సుతో తయారు చేయబడినవే కావచ్చని ఆమె అంచనా వేశారు.

వివరాలు 

రోస్వెల్ వద్ద UFO కూలిందన్న ప్రచారాన్నిఖండించిన అమెరికా ప్రభుత్వం 

ఇక ముందుగా వెలుగులోకి వచ్చిన CIA పత్రాలు 1959లో అమెరికా ప్రభుత్వం UFOలతో రహస్యంగా సంబంధాలు కలిగి ఉందని పేర్కొన్నాయి. అయితే FBI ఆ పత్రాలను నకిలీగా ప్రకటించింది. అలాగే, 1947లో అమెరికాలోని రోస్వెల్ వద్ద UFO కూలిందన్న ప్రచారాన్ని అమెరికా ప్రభుత్వం ఖండించింది. అయినప్పటికీ, పలువురు విశిల్‌బ్లోవర్లు 1947 నుంచి అమెరికా సైన్యం అనేక మానవేతర నౌకలను స్వాధీనం చేసుకుందని చెబుతున్నారు.