Amazon: డ్రోన్ల కలకలం.. మళ్లీ అమెజాన్ AWS సేవలకు అంతరాయం
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో బహ్రెయిన్‌లో అమెజాన్‌కు చెందిన వెబ్ సర్వీసెస్ (AWS)లో అంతరాయం ఏర్పడిందని ఆ సంస్థ వెల్లడించింది. ఆ ప్రాంతంలో కొనసాగుతున్న డ్రోన్ కార్యకలాపాలే ఈ అంతరాయానికి కారణమని అమెజాన్ ప్రతినిధి తెలిపారు. గల్ఫ్ దేశాలపై ఇరాన్ డ్రోన్ దాడులు పెరుగుతున్న సమయంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ఘటన వల్ల ఎంత మేర నష్టం జరిగింది, సేవలు ఎప్పటి వరకు ప్రభావితమవుతాయన్న విషయాలపై అమెజాన్ స్పష్టత ఇవ్వలేదు. అయితే వినియోగదారులకు అంతరాయం కలగకుండా ఉండేందుకు ఇతర ప్రాంతాల్లోని తమ వెబ్ సర్వీసెస్‌కు ట్రాఫిక్‌ను మళ్లించే చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది.
వివరాలు
ఉద్యోగులకు హెచ్చరికలు
ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభావిత ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని ఇప్పటికే సూచనలు ఇచ్చినట్లు అమెజాన్ వెల్లడించింది. ఇదిలా ఉండగా, ఈ నెల ప్రారంభంలోనే బహ్రెయిన్ మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని అమెజాన్ డేటా సెంటర్లపై డ్రోన్ దాడులు జరిగిన విషయం తెలిసిందే. ఆ దాడుల్లో తమ మౌలిక వసతులకు నష్టం జరిగినట్లు అప్పట్లో అమెజాన్ ప్రకటించింది.