America: అమెరికాలో సిక్కు ట్రక్ డ్రైవర్‌పై కిరాతక దాడి.. 17 కత్తిపోట్లు.. సౌత్ వైయోమింగ్‌లో ఘటన
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలోని సౌత్ వైయోమింగ్ రెస్ట్ ఏరియాలో ఓ సిక్కు ట్రక్ డ్రైవర్‌పై దారుణ దాడి జరిగింది. పెన్సిల్వేనియా వైపు ప్రయాణిస్తున్న ఆయన వాష్‌రూమ్‌కు వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వెనుక నుంచి వచ్చిన ఓ అపరిచిత వ్యక్తి ఎలాంటి హెచ్చరికలు లేకుండా ఆయనపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో బాధితుడి మెడ, ఛాతీ, పక్కటెముకల ప్రాంతాల్లో ఏకంగా 17 కత్తిపోట్లు పడ్డాయి. తీవ్ర రక్తస్రావంతో వాష్‌రూమ్ నుంచి బయటకు వచ్చిన ఆయన అక్కడే కుప్పకూలిపోయారు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఓ హిస్పానిక్ కుటుంబం వెంటనే స్పందించింది. ప్రథమ చికిత్స అందించడంతోపాటు బాధితుడిని ఆసుపత్రికి తరలించింది. దీంతో ఆయన ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.
వివరాలు
నిందితుడిపై హత్యాయత్నం కేసు
ఈ ఘటనకు సంబంధించి వైయోమింగ్ పోలీసులు 45 ఏళ్ల ఆండ్రూ క్రిస్‌ను అరెస్ట్ చేశారు. ఆయనపై తొలి స్థాయి హత్యాయత్నం కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
అయితే దాడికి అసలు కారణం ఏమిటన్నది ఇంకా స్పష్టం కాలేదు.
వ్యక్తిగత కక్షతో దాడి చేశాడా? లేక ద్వేషపూరిత నేరం (హేట్ క్రైమ్) కోణం ఏమైనా ఉందా? అనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది.
వివరాలు
వివాదాస్పద పోస్ట్ వెలువడిన కొద్దిరోజులకే ఘటన
ఇటీవల అమెరికా హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగం సోషల్ మీడియాలో చేసిన ఓ వివాదాస్పద పోస్ట్ నేపథ్యంలో ఈ ఘటన ప్రాధాన్యం సంతరించుకుంది.
''మిస్టర్ సింగ్.. మా రోడ్ల పైనుంచి వెళ్లిపోండి'' అంటూ సిక్కు ట్రక్ డ్రైవర్లను ఉద్దేశించి ఆ విభాగం చేసిన వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ఆ పోస్ట్ వెలువడిన కొద్దిరోజులకే ఈ దాడి జరగడం గమనార్హం.
ఈ దాడిని భారతీయ-అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి తీవ్రంగా ఖండించారు.
సిక్కులు, దక్షిణాసియా అమెరికన్లను లక్ష్యంగా చేసుకుని సాగుతున్న ద్వేషపూరిత ప్రచారాలు, దాడులు ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు.
ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలకు ప్రభుత్వ వర్గాలు కూడా దూరంగా ఉండాలని ఆయన డిమాండ్ చేశారు.