న్యూయార్క్‌ను ముంచెత్తిన భారీ వర్షాలు.. స్తంభించిపోయిన జనజీవనం.. ఎమర్జెన్సీ విధింపు
అగ్రరాజ్యం అమెరికాను భారీ వర్షాలు ముంచెత్తాయి. ఈ మేరకు కీలక న్యూయార్క్ నగరం నీట మునిగింది. ఫలితంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో న్యూయార్క్ వాసులు తీవ్ర ఇక్కట్లు అనుభవిస్తున్నారు. 8.5మిలియన్ల జనాభా ఉన్న న్యూయార్క్ వరదల్లో చిక్కుకోవడంతో న్యూయార్క్ గవర్నర్ కాథీ హోచుల్ అధికారికంగా ఎమర్జెన్సీని ప్రకటించారు. మరోవైపు నగర వీధులను వరద నీరు ముంచెత్తుతుండంతో ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రాకూడదని న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్ సూచించారు. ఇంట్లో ఉన్నవాళ్లు అక్కడే ఉండాలని. ఒకవేళ కార్యాలయం, పాఠశాల, ఎక్కడుంటే అక్కడ అలాగే ఆశ్రయం పొందాలన్నారు. సబ్‌వేలు సైతం వరద నీటితో నిండి ఉన్నాయని, రోడ్ల మీద తిరగడం చాలా కష్టమన్నారు.
స్తంభించిపోయిన ప్రజా రవాణా
ఈశాన్య అమెరికాలో అర్థరాత్రి కురిసిన భారీ వర్షాలకు న్యూయార్క్‌లోని చాలా ప్రాంతాలు వరదలో కూరుకుపోయాయి. ఈ క్రమంలోనే సబ్‌వేలు, విమానాశ్రయాలు సైతం స్తంభించిపోయాయి. లాగౌర్డియా విమానాశ్రయంలోని ఒక టెర్మినల్ ను అధికారులు మూసేశారు. వర్షాల థాటికి కార్లు వరదలో మునిగిపోగా, ట్రాఫిక్ నిలిచిపోయింది. నగరంలో 5.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని నేషనల్ వెదర్ సర్వీస్ ప్రకటించింది. మిడిల్ అట్లాంటిక్ తీరం వెంట ఉన్న అల్పపీడన వ్యవస్థ కారణంగానే వానలు కురుస్తున్నాయని పేర్కొంది. 2021లోనూ భారీ వానలు పడ్డాయి. ఇడా హరికేన్ మూలానా వరదలు సంభవించి 13 మంది దుర్మరణం పాలయ్యారు. వరదలతో బ్రూక్లిన్‌తో పాటు అనేక లైన్‌లను మూసివేశారు.