LOADING...
Cuba's Raul Castro: క్యూబాపై అమెరికా కొత్త వ్యూహం.. రౌల్‌ క్యాస్ట్రోపై నేరాభియోగాలు
క్యూబాపై అమెరికా కొత్త వ్యూహం.. రౌల్‌ క్యాస్ట్రోపై నేరాభియోగాలు

Cuba's Raul Castro: క్యూబాపై అమెరికా కొత్త వ్యూహం.. రౌల్‌ క్యాస్ట్రోపై నేరాభియోగాలు

వ్రాసిన వారు Sirish Praharaju
May 22, 2026
10:01 am

ఈ వార్తాకథనం ఏంటి

క్యూబాలో కొనసాగుతున్న సామ్యవాద ప్రభుత్వంపై అమెరికా ఒత్తిడి మరింత పెంచుతోంది. ఈ క్రమంలోనే క్యూబా మాజీ అధ్యక్షుడు రౌల్‌ క్యాస్ట్రోపై అమెరికా నేరాభియోగాలు నమోదు చేయడం అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ఈ చర్య వెనుక క్యూబా ప్రభుత్వాన్ని బలహీనపరిచే వ్యూహం దాగి ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వెనెజువెలా అధ్యక్షుడు నికొలస్‌ మదురోపై అమెరికా గతంలో తీసుకున్న చర్యల మాదిరిగానే రౌల్‌ క్యాస్ట్రోపైనా ఒత్తిడి పెరిగే అవకాశముందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

వివరాలు 

మూడు దశాబ్దాల క్రితం ఘటన మళ్లీ తెరపైకి

1996లో అమెరికాలో ఆశ్రయం పొందిన క్యూబా వ్యతిరేక వర్గాలు కలిసి''బ్రదర్స్‌ టు ద రెస్క్యూ''పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేశాయి. ఆ సంస్థకు చెందిన రెండు విమానాలను అప్పటి క్యూబా ప్రభుత్వం కూల్చివేసింది. ఆ సమయంలో క్యూబా రక్షణ మంత్రిగా ఉన్న రౌల్‌ క్యాస్ట్రో ఆ చర్యకు ఆదేశాలు ఇచ్చారని అమెరికా ఆరోపిస్తోంది. ఈ కేసులో రౌల్‌ క్యాస్ట్రోతో పాటు మరో ఐదుగురు క్యూబా సైనిక పైలట్లపై కూడా అభియోగాలు నమోదు చేశారు. ఈ ఘటనలో మరణించిన నలుగురు అమెరికన్ల కుటుంబాలకు ఇప్పటికీ న్యాయం జరగలేదని అమెరికా తాత్కాలిక అటార్నీ టాడ్‌ బ్లాంష్‌ పేర్కొన్నారు. బాధితుల జ్ఞాపకార్థం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ,దాదాపు 30ఏళ్లుగా ఆ కుటుంబాలు న్యాయం కోసం ఎదురుచూస్తున్నాయని అన్నారు.

వివరాలు 

అమెరికా చర్యను ఖండించిన క్యూబా

రౌల్‌ క్యాస్ట్రో అరెస్టుకు ఇప్పటికే వారంట్‌ జారీ చేశామని, విచారణకు హాజరయ్యేందుకు ఆయన అమెరికాకు వస్తారని ఆశిస్తున్నామని తెలిపారు. అమెరికా తీసుకున్న ఈ నిర్ణయాన్ని క్యూబా ప్రభుత్వం తీవ్రంగా తప్పుబట్టింది. క్యూబా అధ్యక్షుడు మిగెల్‌ దియాజ్‌ క్యానెల్‌ మాట్లాడుతూ, తమ దేశ మాజీ అధ్యక్షుడిపై నేరాభియోగాలు నమోదు చేయడం వెనుక రాజకీయ ఉద్దేశాలే ఉన్నాయని ఆరోపించారు. క్యూబాపై భవిష్యత్తులో సైనిక చర్యలకు మార్గం సుగమం చేసుకునేందుకు అమెరికా ఈ వ్యూహాన్ని అమలు చేస్తోందని అన్నారు.

Advertisement

వివరాలు 

ట్రంప్‌ వ్యాఖ్యలు ఆసక్తికరం

క్యూబాలో త్వరలో ఏం జరగబోతోందనే ప్రశ్నకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆసక్తికరంగా స్పందించారు. ''దాని గురించి త్వరలోనే ప్రపంచం చూస్తుంది'' అని వ్యాఖ్యానించారు. గతంలో అమెరికా అధ్యక్షులు క్యూబా విషయంలో జోక్యం చేసుకోవాలా వద్దా అన్న దానిపై సందిగ్ధంలో ఉన్నారని, అయితే ఆ దేశంలో జోక్యం చేసుకునే అవకాశం ఇప్పుడు తనకు దక్కిందని ట్రంప్‌ పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలతో క్యూబాపై అమెరికా మరింత దూకుడుగా వ్యవహరించే అవకాశముందనే చర్చ సాగుతోంది.

Advertisement