హమాస్ దాడులపై బైడెన్ సంచలన వ్యాఖ్యలు.. భారత్ - మిడిల్ ఈస్ట్ ఎకనామిక్ కారిడార్ కారణమంటూ ఊహ
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంచలన వ్యాఖ్యలకు తెరలేపారు. ఈ భీకర ఉద్రిక్తతలకు భారత్ - మిడిల్ ఈస్ట్ - యూరప్ కారిడార్ కారణం కావొచ్చని ఆయన వివాదాస్పద అభిప్రాయాన్ని వెల్లడించారు. ఇజ్రాయెల్‌పై హమాస్ మెరుపుదాడులు చేయడం వెనుక గల కారణాలను పలు దేశాలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశాయి. ఇప్పటికే అగ్రరాజ్యం అమెరికాపై రష్యా ఓ నింద మోపింది. మిడిల్ ఈస్ట్‌లో ఆ దేశం చేపట్టిన విధానాల్లో ఏర్పడిన వైఫల్యమే ఈ ప్రచ్ఛన్న యుద్ధానికి కారణమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇటీవలే స్పష్టం చేశారు. ఇప్పుడు తాజాగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వివాదాస్పదమైన ప్రతిస్పందనలు చేయడం గమనార్హం.
ఇది కేవలం తన ఊహ మాత్రమేనన్న జో బైడెన్
తీవ్ర ఆరోపణలు చేసిన జో బైడెన్ ఇందుకు సంబంధించి మాత్రం తన వద్ద ఎటువంటి ఆధారాలు లేవని మొండిచేయి చూపారు. ఇది కేవలం తన ఊహ మాత్రమేనన్నారు. మిడిల్ ఈస్ట్ - ఐరోపా ప్రాంతాల్లో ఇజ్రాయెల్ మరింత దగ్గర అవడం, ఇక్కడి సమైక్యత పురోగతి సాధిస్తున్న సందర్భంలో ఈ దాడి జరిగి ఉండొచ్చన్నారు. అయితే ఆ కారిడార్ పనిని మాత్రం తాము వదిలిపెట్టబోమని బైడెన్ అన్నారు. ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌తో జరిగిన భేటీలో అగ్రరాజ్యధిపతి ఈ వ్యాఖ్యలు చేశారు. గత వారంలోనే హమాస్ దాడికి ఈ కారిడారే కారణమని బైడెన్ పేర్కొన్నారు. ఇండియా - మిడిల్ ఈస్ట్ - యూరప్ కారిడార్‌ను జీ20 సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు.