USA: ఇరాన్ ఉద్రిక్తతల మధ్య.. పశ్చిమాసియాకు అమెరికా భారీ ఆయుధాల డీల్
ఈ వార్తాకథనం ఏంటి
ఇరాన్‌తో ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో పశ్చిమాసియాలో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇజ్రాయెల్ సహా పలు మిత్ర దేశాలకు భారీ స్థాయిలో ఆయుధాలను విక్రయించేందుకు యూఎస్ సిద్ధమైంది. ఒకవైపు కాల్పుల విరమణ ఒప్పందం అమలులో ఉండగానే ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇజ్రాయెల్‌తో పాటు కువైట్, ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి దేశాలకు సుమారు 8.6 బిలియన్ డాలర్లకు పైగా (భారత కరెన్సీలో రూ.81 వేల కోట్లకు మించిన) విలువైన సైనిక సామగ్రి విక్రయానికి అమెరికా విదేశాంగ శాఖ ఆమోదం తెలిపింది. ఈ ప్యాకేజీలో అనేక అత్యాధునిక రక్షణ పరికరాలు ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది.
వివరాలు
వేగంగా విక్రయాలు చేసేందుకు చర్యలు
ఈ ఒప్పందంలో భాగంగా ఖతార్‌కు సుమారు 4 బిలియన్ డాలర్ల విలువైన పేట్రియాట్ వాయు, క్షిపణి రక్షణ వ్యవస్థలు, అలాగే అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదించగల ఆధునిక ఆయుధ వ్యవస్థలు అందనున్నాయి. ఇక కువైట్‌కు దాదాపు 2.5 బిలియన్ డాలర్ల విలువైన ఆయుధాలను సరఫరా చేయనున్నారు. అదే సమయంలో ఇజ్రాయెల్, యూఏఈలకు గైడెడ్ రాకెట్ లాంచర్లను కూడా విక్రయించేందుకు అమెరికా నిర్ణయించింది. సాధారణంగా ఇలాంటి ఆయుధ ఒప్పందాలను అమెరికా కాంగ్రెస్ సమీక్షిస్తుంది. అయితే ఈసారి డొనాల్డ్ ట్రంప్ నాయకత్వంలోని యంత్రాంగం అత్యవసర అధికారాలను వినియోగించి, వేగంగా ఈ విక్రయాలు పూర్తిచేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో సమర్థించారు.