Donald Trump: ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. 'ద్రవ్యోల్బణం అంటే ఇష్టం' అంటూ కొత్త చర్చ!
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణం పెరుగుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ, అమెరికాలోనూ ధరల పెరుగుదల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో వెలువడిన ద్రవ్యోల్బణ గణాంకాలపై స్పందించిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ''గణాంకాలు ఆశాజనకంగా ఉన్నాయి.. ద్రవ్యోల్బణం అంటే నాకు చాలా ఇష్టం'' అంటూ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి.
వివరాలు
మే నెలలో 4.2 శాతానికి అమెరికా సీపీఐ
అమెరికాలో కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్ (సీపీఐ) మే నెలలో 4.2 శాతానికి చేరుకుంది. ఏప్రిల్ 2023 తర్వాత ఇదే అత్యధిక స్థాయి కావడం గమనార్హం. పెరుగుతున్న ధరలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న సమయంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రజల ఆర్థిక సమస్యలను తేలికగా తీసుకున్నట్లుగా ఉన్నాయని డెమోక్రాటిక్ పార్టీ తీవ్రంగా విమర్శిస్తోంది. ట్రంప్ వ్యాఖ్యలను రాజకీయ అస్త్రంగా మలుచుకున్న డెమోక్రాట్లు.. ''ద్రవ్యోల్బణాన్ని ప్రేమిస్తున్నానని అమెరికా అధ్యక్షుడే చెబుతున్నారు.. ఈ వ్యాఖ్యలను ప్రతి ఒక్కరూ గమనించాలి'' అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రచారం ప్రారంభించారు. రానున్న నవంబర్ మధ్యంతర ఎన్నికల నేపథ్యంలో ఈ అంశం అమెరికా రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
వివరాలు
ప్రపంచ ఇంధన మార్కెట్లపై తీవ్ర ప్రభావం
మరోవైపు ట్రంప్ వ్యాఖ్యలను ప్రతిపక్షాలు వక్రీకరించాయని రిపబ్లికన్ పార్టీ నేత మైక్ జాన్సన్ వివరణ ఇచ్చినా.. విమర్శల దాడి మాత్రం తగ్గలేదు. ఇక పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ ఇంధన మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిలో అంతరాయాలు ఏర్పడతాయనే భయంతో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఈ ప్రభావంతో అనేక దేశాలు దేశీయంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచుతున్నాయి. దీంతో సామాన్య ప్రజలపై అదనపు భారం పడుతోంది.
వివరాలు
బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 95.40 డాలర్లు
ఇలాంటి పరిస్థితుల్లో ఇరాన్‌పై అమెరికా మరోసారి తీవ్రస్థాయిలో విమర్శలు, చర్యలకు దిగడంతో అంతర్జాతీయ చమురు మార్కెట్ మరింత అప్రమత్తమైంది. బ్రెంట్ క్రూడ్ ధర ఒక బ్యారెల్‌కు 2.47 శాతం పెరిగి 95.40 డాలర్లకు చేరుకుంది. దీంతో రానున్న రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణ ఒత్తిడి మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.