MATI: 'భారత్ అన్ని సంక్షోభాల్లో అండగా నిలిచింది'.. సొంత మంత్రులపై మాల్దీవుల టూరిజం ఫైర్
ప్రధాని నరేంద్ర మోదీపై మాల్దీవుల మంత్రులు చేసిన అభ్యంతరకర ప్రకటనలపై వివాదం కొనసాగుతోంది. మోదీపై వ్యాఖ్యల నేపథ్యంలో భారత్ నుంచి పర్యాటకులు తగ్గారు. ఇదీ మాల్దీవుల పర్యాటక పరిశ్రమపై ప్రతికూల ప్రభావం పడింది. ఈ పరిణామంపై మాల్దీవుల టూరిజం ఇండస్ట్రీ ఆర్గనైజేషన్ (Maldives Association of Tourism Industry- MATI) స్పందించింది. మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సొంత మంత్రులను మాల్దీవుల టూరిజం ఇండస్ట్రీ మందలించింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రధాని మోదీకి, భారత ప్రజలకు వ్యతిరేకంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో తమ ప్రభుత్వానికి చెందిన కొంతమంది మంత్రులు చేసిన అభ్యంతరకర ప్రకటనలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు 'ఎంఏటీఐ' పేర్కొంది. మాల్దీవులకు భారతదేశం అత్యంత సన్నిహిత పొరుగు భాగస్వామిగా అభివర్ణించింది.
మాల్దీవుల పర్యాటక రంగ అభివృద్ధికి భారత్ సహకారం: ఎంఏటీఐ
మాల్దీవుల చరిత్రలో ప్రతి సంక్షోభంలోనూ భారత్ అండగా నిలిచిందని 'ఎంఏటీఐ' గుర్తు చేసింది. భారత ప్రభుత్వం, ప్రజలు తమతో ఏర్పరచుకున్న సన్నిహిత సంబంధాలకు తాము కృతజ్ఞులమని వెల్లడించింది. మాల్దీవుల పర్యాటక రంగ అభివృద్ధికి భారత్ స్థిరమైన, ముఖ్యమైన సహకారం అందించిందినట్లు పేర్కొంది. కరోనావైరస్ మహమ్మారి సమయంలో తమ సరిహద్దులను తెరిచిన అనంతరం మాల్దీవుల పర్యాటక పరిశ్రమ తిరిగి ట్రాక్‌లోకి రావడానికి భారత్ మద్దతు ఇచ్చినట్లు వివరించింది. పర్యాటకంగా మాల్దీవులకు భారత్ ముఖ్యమైన మార్కెట్‌గా ఉందని 'ఎంఏటీఐ' చెప్పింది. రెండు దేశాల మధ్య సంబంధాలు రాబోయే అనేక తరాల వరకు కొనసాగాలని తాము ఆకాంక్షిస్తున్నట్లు వెల్లడించింది.