కొలంబియా రాజధానిలో భారీ భూకంపం.. తీవ్ర భయాందోళనలో ప్రజలు
కొలంబియా రాజధాని బొగోటాలో భారీ భూకంపం సంభవించింది. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.3గా నమోదైనట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. దింతో అక్కడి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. భూకంపం వచ్చిన సమయంలో ఓ భవనం పదో అంతస్తు నుండి ఓ మహిళ క్రింద పడి మరణించినట్లు కొలంబియన్ అధికారులు చెప్పారు. బొగోటాకు సమీపంలో ఉన్నఎల్ కాల్వరియో పట్టణంలో భూకంప కేంద్రం ఉంది. అనంతరం 5.9 తీవ్రతతో భూకంపం సంభవించిందని ఏజెన్సీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. భూకంప భయంతో అక్కడి ప్రజలు రాజధాని వీధుల్లోకి వచ్చారు. భూకంపానికి పెద్ద పెద్ద భవనాలు కంపించాయి. దీంతో సైరన్‌లు మోగించారు.
ప్రజలు జాగ్రత్తగా ఉండాలి: ప్రధాని లోపెజ్
భూకంప కేంద్రానికి దగ్గరలో ఉన్న విల్లావిసెన్సియో, బుకారమంగా, తుంజా, ఇబాగ్ నగరాల్లో భూకంపం సంభవించినట్లు తెలుస్తోంది. అమెరికా రాయబారి ఫ్రాన్సిస్కో పాల్మీరీ బొగోటా హోటల్‌లో ప్రసంగిస్తుండగా భూకంపం సంభవించినట్లు వీడియోలో వెల్లడైంది. భూకంపం రాగానే ఇళ్లలోని ప్రజలు వీధుల్లోకి పరుగులు తీశారు. వీధుల్లోనే భయంతో చాలాసేపు నిరీక్షించారు. ఈ సందర్భంగా ప్రజలు జాగ్రత్తలు ఉండాలని ఆ దేశ ప్రధాని లోపెజ్ సూచించారు. విలావిసెన్సియోలో కొండచరియలు విరిగిపడ్డాయి. 2008లో ఎల్ కాల్వరియోలో 5.5 తీవ్రతతో వచ్చిన భూకంపం వల్ల 11 మంది మరణించగా కొన్ని గృహాలు దెబ్బతిన్నాయి.