Pakistan: పాకిస్తాన్‌లో భారీ పేలుడు.. 50 మంది దుర్మరణం
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో శుక్రవారం ఘోర బాంబు పేలుడు సంభవించింది. శుక్రవారం ప్రార్థనల అనంతరం మసీదు వద్ద పేలుడు చోటుచేసుకుంది. ఈ ఘటనలో 50 మంది పౌరులు అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. వందల సంఖ్యలో తీవ్రంగా గాయపడ్డారు. ఈ సమాచారం అందిన వెంటనే భద్రతా బలగాలు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. గాయపడిన క్షతగాత్రులను దగ్గరలోని ఆసుపత్రులకు తరలించడం కొనసాగుతోంది. ఈ ఘటనా నేపథ్యంలో ఇస్లామాబాద్‌లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు, అయితే ఇప్పటివరకు ఎవరు ఈ దాడికి బాధ్యులని ప్రకటించలేదు.
వివరాలు
నవంబర్ 2025 కూడా ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది
ఇదిలావుంటే, మూడు నెలల క్రితం కూడా ఇలాంటి సంఘటనలే చోటుచేసుకున్నాయి. నవంబర్ 11, 2025న, ఇస్లామాబాద్‌లోని G-11 ప్రాంతంలో సెషన్స్ కోర్టు భవనం వెలుపల ఆత్మాహుతి బాంబు దాడి జరిగింది. ఆ ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు, 30 మందికి పైగా గాయపడ్డారు. ప్రస్తుతం పాకిస్తాన్‌ను ఉగ్ర భూతం నీడలా వెంటాడుతోంది. దేశంలోని ఉగ్ర ముష్కరులు సృష్టిస్తున్న రక్తపాతం తీవ్రంగా పెరుగుతున్న నేపథ్యంలో, భద్రతా బలగాలు విపత్తును నియంత్రించేందుకు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణలో కొనసాగుతున్నాయి. పాక్ సైన్యం ఇంటెలిజెన్స్ ఆధారిత ఆపరేషన్లను వేగవంతం చేసింది. తాజా బ్లాస్టింగ్ కూడా ఉగ్రవాదులకు సంబంధించినదే కావచ్చని భద్రతా అధికారులు అనుమానిస్తున్నారు.