Sultan of Brunei: కోడలి ప్రవర్తనపై ఆగ్రహం.. రాజకుటుంబ హోదా తొలగించిన సుల్తాన్
ఈ వార్తాకథనం ఏంటి
బ్రూనై సుల్తాన్ హసనల్ బోల్కియా తన కోడలు పెంగిరాన్ రాబియాతుల్ అదావియ్యా పెంగిరాన్ హాజీ బోల్కియాకు ఇచ్చిన రాజకుటుంబ హోదాను రద్దు చేశారు. ఆగస్టు 8న జారీ చేసిన రాజాజ్ఞతో ఆమెకు ఉన్న 'యాంగ్ అమత్ ములియా పెంగిరాన్ అనక్ ఇస్టెరి' అనే రాయల్ టైటిల్‌ను తక్షణమే తొలగించారు. పెంగిరాన్ రాబియాతుల్ అదావియ్యా.. సుల్తాన్ హసనల్ బోల్కియా నాలుగో కుమారుడు ప్రిన్స్ అబ్దుల్ మాలిక్‌కు భార్య. వీరిద్దరూ 2015లో వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు నలుగురు సంతానం ఉన్నట్లు సమాచారం. వారంతా కుమార్తెలేనని తెలుస్తోంది.
వివరాలు
సుల్తాన్‌ను గౌరవించలేదని..
బ్రూనై గ్రాండ్ ఛాంబర్లెయిన్ కార్యాలయం ఈ రాజాజ్ఞను ప్రకటించింది. రాజకుటుంబ సభ్యుడి భార్యగా ఉండేందుకు తగని విధంగా రాబియాతుల్ అదావియ్యా ప్రవర్తించినట్లు అధికారులు పేర్కొన్నారు.
ఆమె వ్యవహారశైలి రాజకుటుంబ ప్రతిష్ఠకు భంగం కలిగించడంతో పాటు.. సుల్తాన్ హసనల్ బోల్కియాపై గౌరవం చూపలేదని గుర్తించినట్లు తెలిపారు.
అయితే ఆమె ఏం చేశారనే విషయాన్ని మాత్రం అధికారులు వెల్లడించలేదు.
ఈ నిర్ణయానికి దారితీసిన ఘటనలు, ఆరోపణలకు సంబంధించిన మరిన్ని వివరాలు కూడా బయటకు రాలేదు.
వివరాలు
పిల్లల హోదాపై ప్రభావం లేదు
సుల్తాన్ తీసుకున్న నిర్ణయం కారణంగా రాబియాతుల్ అదావియ్యా పిల్లల రాజకుటుంబ హోదాలకు ఎలాంటి మార్పు ఉండదని సమాచారం. వారి టైటిళ్లు యథావిధిగా కొనసాగనున్నాయి.
హసనల్ బోల్కియా ప్రపంచంలో అత్యధిక కాలం పాలించిన రాజుల్లో రెండో స్థానంలో ఉన్నారు. 1967లో తన తండ్రి సింహాసనాన్ని వదులుకోవడంతో ఆయన బ్రూనై సుల్తాన్‌గా బాధ్యతలు చేపట్టారు.
1984లో బ్రిటిష్ పాలన ముగిసిన తర్వాత నుంచి దేశ ప్రధానమంత్రిగానూ కొనసాగుతున్నారు.
ప్రపంచంలోని అత్యంత సంపన్న వ్యక్తుల్లో ఒకరిగా కూడా హసనల్ బోల్కియాకు పేరుంది. ఆయన సంపద సుమారు 20-30 బిలియన్ అమెరికన్ డాలర్లు ఉంటుందని అంచనా.
సుల్తాన్‌కు ముగ్గురు భార్యలు, 12 మంది పిల్లలు, 20 మంది మనుమలు ఉన్నారు.