టర్కీలో 5.4 తీవ్రతతో మరో భూకంపం, 5,000 దాటిన మరణాలు
టర్కీలో మరో శక్తివంతమైన భూకంపం సంభవించింది. ఇది రిక్టర్ స్కేలుపై 5.4గా నమోదైందని యూఎస్ జియోలాజికల్ సర్వే (యూఎస్‌జీఎస్) తెలిపింది. సోమవారం నుంచి టర్కీ, సిరియా వరుస భూకంపాలతో అల్లాడిపోతున్నాయి. ఇప్పటికే నాలుగు భూకంపాలు నమోదు కాగా, తాజాగా ఐదోవసారి శక్తివంతమైన భూకంపం సంభవించినట్లు యూఎస్‌జీఎస్ పేర్కొంది. భారీ భూకంపాలు వేలాది మందిని పొట్టనపెట్టుకున్నాయి. లక్షలాది మందిని నిరాశ్రయులను చేశాయి. భూకంపాలు సృష్టించిన విధ్వంసాల వల్ల టర్కీ, సిరియాలో మరణాల సంఖ్య 5,000 కు పెరిగింది.
ధ్వంసమైన జైలు, పారిపోయిన ఉగ్రవాదులు
భూకంపాలు లక్షలాది మంది ప్రజలకు విషాధాన్ని మిగిల్చితే.. ఉగ్రవాదులకు మాత్రం ఉపశమనాన్ని కలిగించింది. సిరియాలో సంభవించిన భూకంపానికి ఓ జైలు కూడా ధ్వంసమైంది. ఈ క్రమంలో అందులో ఉన్న ఉగ్రవాదులు పారిపోయినట్లు మీడియా కథనాలు చెబుతున్నాయి. సోమవారం తెల్లవారుజామున సిరియా సరిహద్దుకు సమీపంలో టర్కీలోని గాజియాంటెప్ ప్రావిన్స్‌లో 7.8తీవ్రతతో భూకంపం సంభవించింది. తర్వాత గాజియాంటెప్‌కు ఉత్తరాన 130కిలోమీటర్ల దూరంలో 7.5 తీవ్రతతో మరో భూకంపం సంభవించింది. దీని భూకంప కేంద్రం టర్కీలోని కహ్రామన్‌మరాస్ ప్రావిన్స్‌లోని ఎల్బిస్తాన్ జిల్లాలో ఉన్నట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. రిక్టర్ స్కేలుపై 6.0 తీవ్రతతో మూడో భూకంపం సోమవారం టర్కీలోని గోక్సన్‌ను తాకింది. సిరియా సరిహద్దుకు సమీపంలో ఉన్న గాజియాంటెప్‌కు ఉత్తరాన ఉన్న కహ్రామన్మరాస్ ప్రావిన్స్‌లో సంభవించింది.