టర్కీ, సిరియాలో ప్రకృతి విలయం: వరుస భూకంపాల ధాటికి 4300మందికిపైగా దుర్మరణం
టర్కీ, సిరియాలో భూకంపం ప్రళయం సృష్టించింది. శక్తిమంతమైన భూకంపాల ధాటికి 4300మందికిపైగా మృతి చెందినట్లు వాషింగ్టన్ పోస్ట్ నివేదించింది. టర్కీ, సిరియాలలో సోమవారం 7.8, 7.6, 6.0 తీవ్రతతో మూడు వరుస విధ్వంసక భూకంపాలు సంభవించాయి. సోమవారం తెల్లవారుజామున సిరియా సరిహద్దుకు సమీపంలో టర్కీలోని గాజియాంటెప్ ప్రావిన్స్‌లో 7.8తీవ్రతతో భూకంపం సంభవించింది. తర్వాత గాజియాంటెప్‌కు ఉత్తరాన 130కిలోమీటర్ల దూరంలో 7.5 తీవ్రతతో మరో భూకంపం సంభవించింది. దీని భూకంప కేంద్రం టర్కీలోని కహ్రామన్‌మరాస్ ప్రావిన్స్‌లోని ఎల్బిస్తాన్ జిల్లాలో ఉన్నట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. రిక్టర్ స్కేలుపై 6.0 తీవ్రతతో మూడో భూకంపం సోమవారం టర్కీలోని గోక్సన్‌ను తాకింది. సిరియా సరిహద్దుకు సమీపంలో ఉన్న గాజియాంటెప్‌కు ఉత్తరాన ఉన్న కహ్రామన్మరాస్ ప్రావిన్స్‌లో సంభవించింది.
మృతుల సంఖ్య 20వేలకు చేరే అవకాశం
భూకంపం కారణంగా టర్కీ,సిరియాలో 4,372 మంది చనిపోయినట్లు, ఈ సంఖ్య 20వేలకు చేరొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేస్తోంది. మంగళవారం ఉదయం నాటికి టర్కీలో మృతుల సంఖ్య 2,921కి చేరినట్లు టర్కీ విపత్తు సేవల అధిపతి యూనస్ సెజర్ తెలిపారు. మొత్తం 15,834 మంది గాయపడినట్లు వెల్లడించారు. సిరియాలో 1,451 మరణాలు సంభవించగా, 3,531 మంది గాయపడినట్లు సీఎన్ఎన్ నివేదించింది. ఈభూకంపాల వల్ల ఎక్కువ ఆస్తి, ప్రాణ నష్టం దక్షిణ టర్కీ, ఉత్తర, మధ్య సిరియాలో జరిగనట్లు వార్తా సంస్థలు చెబుతున్నాయి. గత 80 ఏళ్లలో టర్కీని తాకిన బలమైన భూకంపం ఇదే. భూకంపాల ధాటికి రెండు దేశాలలో వేలాది భవనాలు కూలిపోయాయి. వేలాదిమంది భవనాల కింద చిక్కుకొని సాయంకోసం అర్జిస్తున్నారు.