
Kamchatka: రష్యాలో మరోసారి భూకంపం.. కామ్చాట్కా తీరంలో 5.0 తీవ్రతతో మరోసారి ప్రకంపనలు
ఈ వార్తాకథనం ఏంటి
రష్యాలోని తూర్పు చివరనున్న కమ్చాట్కా ద్వీపకల్పాన్ని భూకంపాలు వదలడం లేదు. తాజాగా అక్కడ మళ్లీ భూమి కంపించడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. ఈసారి నమోదైన భూకంపం తీవ్రత 5గా ఉందని అధికారులు వెల్లడించారు. ఇది పెట్రోపావ్లోవ్స్క్-కమ్చాట్‌స్కీ అనే ప్రధాన నగరానికి దక్షిణదిశగా సుమారు 108 కిలోమీటర్ల దూరంలో, మధ్యాహ్నం 1 గంట 57 నిమిషాలకు సంభవించిందని భూకంప పరిశీలన సంస్థలు ధృవీకరించాయి. కొన్ని రోజుల క్రితం ఇదే ప్రాంతంలో 8.8 తీవ్రతతో వచ్చిన భారీ భూకంపం తర్వాత తాజా భూకంపం సంభవించడం గమనార్హం. అప్పటి భారీ భూకంపం కారణంగా పసిఫిక్ మహాసముద్రంలో సునామీ హెచ్చరికలు జారీ చేయాల్సి వచ్చింది.
వివరాలు
సముద్రతీరంలో, మధ్యస్థ లోతులో సంభవించడం తప్పిన ముప్పు
తాజా భూకంపం సముద్రతీరంలో, మధ్యస్థ లోతులో సంభవించడం వల్ల ఉపరితలంపై దాని ప్రభావం తక్కువగా ఉందని ప్రాథమిక నివేదికలు చెబుతున్నాయి. కమ్చాట్కా ప్రాంతం పసిఫిక్ టెక్టోనిక్ ప్లేట్ కదలికలకు అత్యంత సమీపంలో ఉండటం వల్ల, ఇక్కడ తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి. ఈ ప్లేట్ కదులుతూనే ఉండటం వల్ల భూకంపాల తీవ్రత, తరచుదనం పెరిగే అవకాశం ఉందని భూగర్భ శాస్త్ర నిపుణులు హెచ్చరిస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రకంపనలు మరిన్ని రావచ్చని కూడా వారు సూచిస్తున్నారు.