Bangladesh: బంగ్లాదేశ్‌లో మరో దారుణం.. దుకాణంలో నిద్రిస్తున్న హిందూ యువకుడి సజీవ దహనం
ఈ వార్తాకథనం ఏంటి
బంగ్లాదేశ్‌లో మరో భయానక ఘటన వెలుగులోకి వచ్చింది. దుకాణంలో నిద్రిస్తున్న ఓ హిందూ యువకుడిని అల్లరిమూకలు సజీవ దహనం చేసిన దారుణం నార్సింగ్డి ప్రాంతంలో చోటుచేసుకుంది. ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. శుక్రవారం అర్ధరాత్రి సమయంలో అల్లరిమూకలు ఓ దుకాణంపై దాడికి దిగాయి. షట్టర్‌ను పూర్తిగా మూసివేసి, లోపల పెట్రోల్ పోసి నిప్పు అంటించారు. ఆ సమయంలో దుకాణంలోనే నిద్రిస్తున్న చంచల్ భౌమిక్ (23)అనే హిందూ యువకుడు బయటకు వచ్చే అవకాశం లేకుండా సజీవ దహనం అయ్యాడు. చంచల్ మృతి చెందినట్లు నిర్ధారించుకున్న తర్వాతే దుండగులు అక్కడి నుంచి పారిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. మృతుడు చంచల్‌కు తల్లి, ఇద్దరు సోదరులు ఉన్నారు. వారిలో ఒకరు దివ్యాంగుడిగా కుటుంబ సభ్యులు తెలిపారు.
Details
బంగ్లాదేశ్‌లో మైనారిటీల భద్రతపై మళ్లీ తీవ్రమైన ఆందోళనలు
తండ్రి చాలా ఏళ్ల క్రితమే మృతి చెందడంతో, కుటుంబ బాధ్యతలన్నీ చంచల్‌పైనే ఉన్నాయి. కుటుంబ పోషణ కోసం అతడు నార్సింగ్డి ప్రాంతంలోని ఓ గ్యారేజీలో గత ఆరేళ్లుగా పనిచేస్తూ, అదే దుకాణంలో నివసిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ హత్య పథకం ప్రకారమే జరిగిందని చంచల్ కుటుంబ సభ్యులు, అతడి యజమాని ఆరోపిస్తున్నారు. ఇది యాదృచ్ఛిక ఘటన కాదని, ఉద్దేశపూర్వకంగానే దుకాణాన్ని లక్ష్యంగా చేసుకుని దాడి చేశారని వారు పేర్కొన్నారు. గతంలో కూడా బంగ్లాదేశ్‌లో దీపు చంద్రదాస్, ఖోకొన్ చంద్రదాస్ అనే వ్యక్తులను ఇదే తరహాలో అల్లరిమూకలు సజీవ దహనం చేసిన ఘటనలు చోటుచేసుకున్నాయని గుర్తు చేస్తున్నారు. ఈ తాజా ఘటనతో బంగ్లాదేశ్‌లో మైనారిటీల భద్రతపై మళ్లీ తీవ్రమైన ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.