LOADING...
Earthquake: మయన్మార్‌లో మళ్లీ భూకంపం.. భయాందోళనలో ప్రజలు
మయన్మార్‌లో మళ్లీ భూకంపం.. భయాందోళనలో ప్రజలు

Earthquake: మయన్మార్‌లో మళ్లీ భూకంపం.. భయాందోళనలో ప్రజలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 13, 2025
11:03 am

ఈ వార్తాకథనం ఏంటి

మయన్మార్‌ మరోసారి ప్రకృతి ప్రకోపానికి గురైంది. ఆదివారం ఉదయం మయన్మార్‌లో 5.6 తీవ్రతతో భూప్రకంపనలు సంభవించాయి. ఈ మేరకు యూరోపియన్ మెడిటేరియన్ సిస్మోలాజికల్ సెంటర్ (EMSC) అధికారిక ప్రకటన విడుదల చేసింది. భూకంప కేంద్రం మావో, హంగ్ సన్ ప్రావిన్సులకు వాయువ్య దిశగా 270 కిలోమీటర్ల దూరంలో, భూమి ఉపరితలానికి 35 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు వివరించింది. అయితే భారత నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ మాత్రం భూకంప తీవ్రత 5.1గా ఉండగా, కేంద్రం భూమికి కేవలం 10 కిలోమీటర్ల లోతులోనే ఉందని తెలిపింది. ఇక మార్చి 28న మయన్మార్‌లో సంభవించిన భారీ భూకంపం దేశాన్ని తీవ్రంగా కుదిపేసింది. అందులో 4,000 మందికి పైగా మరణించగా, వేలాదిమంది గాయపడ్డారు.

Details

 'సగాయింగ్‌ ఫాల్ట్‌' సమీపంలో ఉండటంతో తరుచుగా భూ ప్రకంపనలు 

శిధిలాల కింద చిక్కుకున్నవారిని రోజులు గడిచాక సైతం ప్రాణాలతో రక్షించిన వీడియోలు అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వరుస ప్రకంపనలతో గత రెండు వారాలుగా వారికి నిద్రకూడా లేకుండా పోయింది. మార్చి 28 నుంచి ఇప్పటివరకు మయన్మార్ పరిసర ప్రాంతాల్లో 468కి పైగా భూప్రకంపనలు నమోదయ్యాయని భూకంప కేంద్రాలు పేర్కొన్నాయి. శుక్రవారం కూడా 4.1 తీవ్రతతో మరో భూప్రకంపన సంభవించింది. భూగర్భ శాస్త్రవేత్తల ప్రకారం, మయన్మార్‌ 'సగాయింగ్‌ ఫాల్ట్‌' సమీపంలో ఉండటంతో తరుచుగా ప్రకంపనలు సంభవించడం సహజమే. భారత్ టెక్టానిక్ ప్లేట్‌, మయన్మార్ మైక్రోప్లేట్‌ల మధ్య ఈ ఫాల్ట్ లైన్ దాదాపు 1,200 కిలోమీటర్ల పొడవున విస్తరించి ఉండటంతో ఒత్తిడి ఎక్కువగా పేరుకుపోయి తరుచూ భూకంపాలు వస్తాయని వారు తెలిపారు.

Details

మయన్మార్ ను ఆదుకొనేందుకు 'ఆపరేషన్ బ్రహ్మ' చేపట్టిన భారత్

అంతకుముందు సంభవించిన భారీ భూకంపంలో మౌలిక వసతులు, వంతెనలు, రహదారులు, కమ్యూనికేషన్ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నప్పటికీ, వసతుల లోపం వల్ల వాటికి ఆటంకాలు ఏర్పడ్డాయి. ఇక మయన్మార్‌ను ఆదుకునేందుకు భారత్‌ 'ఆపరేషన్ బ్రహ్మ' చేపట్టింది. దాని ద్వారా వైద్య సహాయంతోపాటు, ఆర్మీ ఫీల్డ్ హాస్పిటల్‌లను ఏర్పాటు చేసి వేలాదిమందికి చికిత్స అందించింది. మయన్మార్‌లోని నేపిటా, మండలే ప్రాంతాల్లో శిబిరాలు ఏర్పాటుచేసి బాధితులకు సహాయం చేస్తున్నాయి. మొత్తానికి, మయన్మార్‌లో ప్రకృతి విలయం కొనసాగుతూనే ఉంది. భూకంపాల ముప్పుతో ప్రజలు తీవ్ర భయాందోళనలో ఉన్నారు.