Trump: ట్రంప్ పాలనలో మరో సంచలన నిర్ణయం.. 41 దేశాలకు ట్రావెల్ బ్యాన్!
ఈ వార్తాకథనం ఏంటి
ఉద్యోగాల కోతలు, విదేశీ వాణిజ్యంపై సుంకాలు విధించడం వంటి చర్యలతో దూకుడు పాలన కొనసాగిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, తాజాగా మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం.
పదుల సంఖ్యలో దేశాలపై ప్రయాణ ఆంక్షలు విధించేందుకు ట్రంప్ సర్కారు సన్నాహాలు చేస్తోందని తెలుస్తోంది.
41 దేశాల పౌరులు అమెరికా ప్రవేశాన్ని నిలిపివేస్తూ త్వరలో ఆంక్షలు విధించనున్నట్లు పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు నివేదిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఒక ఇంటర్నల్ మెమో బయటికొచ్చింది. అందులో ఈ 41 దేశాలను మూడు విభాగాలుగా వర్గీకరించినట్లు తెలుస్తోంది.
Details
మొదటి గ్రూప్ - పూర్తిగా ట్రావెల్ బ్యాన్
అఫ్గానిస్థాన్, ఇరాన్, సిరియా, క్యూబా, ఉత్తరకొరియా వంటి 10 దేశాలకు వీసాల జారీ పూర్తిగా నిలిపివేయనున్నట్లు సమాచారం.
రెండో గ్రూప్- పాక్షిక ఆంక్షలు
ఇరిట్రియా, హైతీ, లావోస్, మయన్మార్, దక్షిణ సూడాన్ దేశాలకు పర్యాటక, విద్యార్థి వీసాల జారీ నిలిపివేయాలని భావిస్తున్నారు. అయితే కొన్ని మినహాయింపులు ఉండే అవకాశం ఉంది.
Details
మూడో గ్రూప్ - వీసా ఆంక్షల అవకాశాలు
పాకిస్థాన్, బూటాన్ సహా 26 దేశాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ దేశాలు 60 రోజుల్లోపు తమ భద్రతా లోపాలను పరిష్కరించకపోతే అక్కడి పౌరులకు వీసా జారీని పాక్షికంగా నిలిపివేయాలని యూఎస్ యంత్రాంగం భావిస్తోంది.
ప్రస్తుతం అమెరికా మీడియా ఈ జాబితాను వెల్లడించకపోయినా ఇందులో మార్పులు జరిగే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.
విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఆమోదం అనంతరం దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది.