Houthis: హర్మూజ్ తర్వాత మరో షాక్.. బాబ్ అల్ మాండెబ్ మూసేస్తామన్న హూతీలు
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధ పరిస్థితుల ప్రభావంతో ఇప్పటికే హోర్ముజ్ జలసంధి మూసివేత కారణంగా అనేక దేశాల్లో చమురు, గ్యాస్ కొరత తీవ్రంగా పెరిగింది. ఈ పరిస్థితుల్లో మరో కీలక హెచ్చరిక వెలువడింది. యెమెన్‌లోని హూతీ (Houthis) తిరుగుబాటు దళాలు, బాబ్ అల్-మండేబ్ జలసంధిని కూడా మూసివేస్తామని ప్రకటించాయి. ప్రపంచ శాంతికి విఘాతం కలిగించే చర్యలను డొనాల్డ్ ట్రంప్ కొనసాగిస్తే ఈ నిర్ణయం అమలు చేస్తామని స్పష్టం చేశాయి. హూతీ ప్రభుత్వ విదేశాంగ శాఖ ఉపమంత్రి హుస్సేన్ మాట్లాడుతూ, ఒకసారి బాబ్ అల్ మాండెబ్ జలసంధిని మూసివేస్తే దాన్ని తిరిగి తెరవడం ప్రపంచంలోని ఏ దేశానికీ సాధ్యం కాదని హెచ్చరించారు.
వివరాలు
ఏకపక్ష కాల్పుల విరమణ ఒప్పందంపై తీవ్ర అభ్యంతరం
ప్రపంచ శాంతికి ఆటంకం కలిగించే చర్యలను ట్రంప్ వెంటనే నిలిపివేయాలని, అలాగే అమెరికాకు మద్దతు ఇస్తున్న దేశాలు కూడా ఈ విధ్వంసక చర్యల నుంచి వెనక్కి తగ్గాలని సూచించారు. అదే అందరికీ మేలు చేస్తుందని పేర్కొన్నారు. ఇక మరోవైపు ఇజ్రాయెల్‌తో కుదిరిన ఏకపక్ష కాల్పుల విరమణ ఒప్పందంపై హెజ్‌బొల్లా (Hezbollah) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ సంస్థ సెక్రటరీ జనరల్ నయీమ్ ఖాసిం, ఈ ఒప్పందం లెబనాన్‌కు అవమానకరమని విమర్శించారు. అలాంటి ఒప్పందానికి తమ బృందం కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. 2024లో కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఇజ్రాయెల్‌ను నమ్మగా, కాల్పుల విరమణ కొనసాగుతున్న సమయంలోనే పౌరులపై భారీ దాడులు జరిగిన విషయాన్ని గుర్తు చేశారు.
వివరాలు
45 లక్షల బ్యారెళ్ల చమురు ఈ మార్గం ద్వారా రవాణా
ప్రపంచ వాణిజ్యంలో అత్యంత ప్రాధాన్యం కలిగిన బాబ్ అల్-మండేబ్ జలసంధి జలసంధి యెమెన్, జిబౌటి దేశాల మధ్య ఉంది. ఇది ఎర్ర సముద్రాన్ని అరేబియా సముద్రంతో అనుసంధానిస్తూ, సూయజ్ కెనాల్ వైపు వెళ్లే నౌకలకు ప్రధాన మార్గంగా ఉంది. గల్ఫ్ ఆఫ్ అడెన్, ఎర్ర సముద్రాల మధ్య ద్వారంలా ఉండే ఈ జలసంధి వెడల్పు సుమారు 30 కిలోమీటర్లు మాత్రమే. ఆసియా, ఐరోపా, ఉత్తర అమెరికా, పశ్చిమాసియా మధ్య ప్రయాణించే వాణిజ్య నౌకలు, చమురు ట్యాంకర్లకు ఇది కీలక మార్గం. రోజుకు సుమారు 45 లక్షల బ్యారెళ్ల చమురు ఈ మార్గం ద్వారా రవాణా అవుతోంది.
వివరాలు
ఆహార పదార్థాలు కూడా ఈ మార్గం ద్వారానే రవాణా
అంతర్జాతీయ వాణిజ్యంలో దాదాపు 10-12 శాతం సరకు రవాణా ఇదే మార్గం మీద ఆధారపడుతోంది. ఎల్‌ఎన్‌జీ, తయారీ వస్తువులు, ఆహార పదార్థాలు కూడా ఈ మార్గం ద్వారానే ప్రధానంగా తరలింపబడుతున్నాయి. ప్రతి ఏడాది సుమారు రూ.93.95 లక్షల కోట్ల విలువైన సరుకులు ఈ జలసంధి గుండా రవాణా అవుతున్నట్లు అంచనా.