Ukraine war: ఉక్రెయిన్‌కు యాంటీ పర్సనల్ మైన్స్.. బైడెన్ సర్కార్ కీలక నిర్ణయం!
పదవీకాలం ముగుస్తున్న సమయంలో అమెరికా సర్కారు ఉక్రెయిన్‌కు భారీ సంఖ్యలో ఆయుధాలను అందజేస్తోంది. తాజాగా యూఎస్ ప్రభుత్వం ఉక్రెయిన్‌కు యాంటీ పర్సనల్ మైన్స్‌ను అందించాలనుకున్నట్లు ప్రకటించింది. ఇది యుద్ధం ప్రారంభమైన తర్వాత తొలిసారి ఇలాంటి మైన్స్‌ను ఉక్రెయిన్ అందుకుంటోంది. అమెరికా తన దీర్ఘశ్రేణి ఆయుధాలను రష్యా మీద ప్రయోగించడానికి ఒక్కరోజు వ్యవధిలోనే ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఉక్రెయిన్ తూర్పు ప్రాంతాల్లో రష్యా బలగాలు శక్తివంతంగా కదలికలతో ఉన్న నేపథ్యంలో ఈ మైన్స్‌ను ఉపయోగించడం ద్వారా రష్యా ప్రగతిని అడ్డుకోవాలని ఉక్రెయిన్ లక్ష్యంగా పెట్టుకుంది.
ఉక్రెయిన్ ను అమెరికా సాయం
ఈ మైన్స్ ఉక్రెయిన్ భూభాగాన్ని రక్షించడంలో అనుకూలంగా ఉండాలని అమెరికా భావిస్తోంది. ఉక్రెయిన్ ఇప్పటికే అగ్రరాజ్యాలకు హామీ ఇచ్చింది. ఇప్పటికే అమెరికా, ఉక్రెయిన్‌కు భారీ సంఖ్యలో యాంటీ ట్యాంక్ మైన్స్ అందించిన విషయం తెలిసిందే. వీటిని రష్యా యుద్ధట్యాంకులను, సాయుధ వాహనాలను ధ్వంసం చేయడంలో ఉపయోగిస్తారు. అయితే మానవ హక్కుల సంఘాలు ఈ అంగీకారాలను తీవ్రంగా విమర్శించడంతో, అమెరికా తొలుత యాంటీ పర్సనల్ మైన్స్‌ను ఇవ్వలేదు. ఇప్పుడు, ఈ మైన్స్‌కు సంబంధించిన తాజా ఆవిష్కరణలు, వాటి బ్యాటరీ ఆధారిత వ్యవస్థకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
యాక్టివ్ మోడ్ లో రెండు వారాలు
ఈ మైన్స్ నాలుగు గంటల నుండి రెండు వారాల వరకు మాత్రమే యాక్టివ్‌గా ఉంటాయి. అనంతరం బ్యాటరీ జీవితకాలం ముగిసిన తర్వాత అవి ఆటోమేటిక్‌గా నిర్వీర్యమైపోతాయి. ఈ విధానం మైన్స్ వాడకం తరువాత ఏర్పడే ప్రమాదాన్ని తగ్గించేందుకు అమెరికా ప్రభుత్వం రూపొందించింది. అమెరికా ప్రభుత్వం ఈ మైన్స్ తయారీని ఇప్పటికే నిలిపివేసినట్లు తెలిపింది.