
China: 'బుజ్జగింపులు శాంతిని తీసుకురాలేవు': అమెరికాతో ట్రేడ్ డీల్ విషయంలో ఆ దేశాలకు చైనా హెచ్చరిక
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్‌ల (సుంకాలు) నుంచి విముక్తి పొందేందుకు అనేక దేశాలు అమెరికాతో సంప్రదింపులు జరుపుతున్నాయి.
అయితే, ఈ సుంకాల నుంచి మినహాయింపులు పొందాలంటే చైనా దేశంతో తమ ఆర్థిక సంబంధాలను విరమించాల్సిందిగా ట్రంప్ ప్రభుత్వమే కొన్ని మిత్రదేశాలకు స్పష్టంగా సూచించినట్లు పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి.
ఈ వార్తల నేపథ్యంలో తాజాగా చైనా అధికారికంగా తీవ్ర స్పందన తెలిపింది.
తమ దేశ హితాలకు హానికరంగా ఉంటే దీని పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, అవసరమైతే కౌంటర్ చర్యలు తీసుకోక తప్పదని హెచ్చరించింది.
వివరాలు
అలాంటి ఒప్పందాలను తీవ్రంగా వ్యతిరేకిస్తాం: చైనా
ఈ నేపథ్యంలో చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు.
''అమెరికాతో ఒప్పందాలు చేసుకునే సందర్భంలో, వాటి ప్రభావం చైనా ప్రజల ప్రయోజనాలను దెబ్బతీయగలదనుకుంటే, అలాంటి ఒప్పందాలను మేం తీవ్రంగా వ్యతిరేకిస్తాం. అలాంటి పరిణామాలను మేం ఎప్పటికీ అంగీకరించం. అలాగే, మా నుంచి వచ్చే ప్రతిస్పందన కూడా అదే తీవ్రతతో ఉంటుంది. సౌమ్యంగా మాట్లాడితేనే శాంతి సాధ్యమవుతుందనుకోవడం తప్పుడు భ్రమ. రాజీ పడితే గౌరవం దక్కదు. తక్షణ లాభాల కోసం తీసుకునే నిర్ణయాలు భవిష్యత్‌లో తీవ్రమైన నష్టాలను కలిగించే అవకాశం ఉన్నదన్న విషయాన్ని దేశాలు గుర్తించాలి'' అని ఆ ప్రకటనలో స్పష్టం చేశారు.