Niger:నైజర్‌లో అల్‌ఖైదా ఉగ్రదాడి.. ఎయిర్‌పోర్టు,సైనిక స్థావరాలపై దాడి.. 13 మంది మృతి
ఈ వార్తాకథనం ఏంటి
నైజర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. గురువారం స్థానిక కాలమానం ప్రకారం రాజధాని నియామేలోని దియోరి హమాని అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు సమీప సైనిక వైమానిక స్థావరాలపై భారీ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో మొత్తం 13 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. ఈ దాడికి అల్‌ఖైదా అనుబంధ ఉగ్ర సంస్థ జమాత్ నుస్రత్ అల్-ఇస్లాం వల్ ముస్లిమిన్ (JNIM) బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించింది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం,స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 6 గంటల సమయంలో ప్రారంభమైన ఈ దాడి రెండు గంటలకు పైగా కొనసాగింది. మృతుల్లో 11 మంది సైనికులు ఉండగా,మరో ఇద్దరు సాధారణ పౌరులని అధికారులు తెలిపారు.
వివరాలు
22 మంది దుండగులు హతం
దాడి సమాచారం అందుకున్న భద్రతా బలగాలు వెంటనే రంగంలోకి దిగి ఉగ్రవాదులను ప్రతిఘటించాయని ప్రభుత్వం వెల్లడించింది. భద్రతా బలగాల ఎదురుదాడిలో 22 మంది దుండగులు హతమైనట్లు అధికారులు ప్రకటించారు. మరికొందరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఉగ్రవాదుల వద్ద నుంచి పదుల సంఖ్యలో ఆయుధాలు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా అదుపులో ఉన్నాయని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. తాజా దాడి అనంతరం దియోరి హమాని అంతర్జాతీయ విమానాశ్రయంలో భద్రతా ఏర్పాట్లను మరింత కట్టుదిట్టం చేశారు. కొంతసేపు నిలిపివేసిన విమాన రాకపోకలను తిరిగి ప్రారంభించినట్లు నైజర్ పౌర విమానయాన సంస్థ ప్రకటించింది.
వివరాలు
నైజర్‌లో భద్రతా పరిస్థితులపై మరోసారి ఆందోళనలు
ఇదిలా ఉండగా, ఈ దాడికి తామే బాధ్యులమని జేఎన్‌ఐఎం సోషల్ మీడియాలో విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది. విమానాశ్రయంతో పాటు దాని సమీపంలోని సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని ఆత్మాహుతి దాడులు నిర్వహించినట్లు పేర్కొంది. కాగా, ఈ ఏడాదిలో నియామే విమానాశ్రయ ప్రాంగణంపై దాడి జరగడం ఇది రెండోసారి కావడం గమనార్హం. ఈ ఏడాది జనవరిలో ఇస్లామిక్ స్టేట్ సాహెల్ ప్రావిన్స్ అనే ఉగ్ర సంస్థ ఇదే ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని దాడికి పాల్పడింది. తాజా ఘటనతో నైజర్‌లో భద్రతా పరిస్థితులపై మరోసారి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.