Colombia: కొలంబియాలో హైటెన్షన్.. సూపర్ మార్కెట్‌లో 20 మంది బందీలు
ఈ వార్తాకథనం ఏంటి
కొలంబియాలోని ప్రముఖ పర్యాటక నగరం కార్టజీనాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నగదు తరలిస్తున్న ఓ సాయుధ వాహనాన్ని దోచుకునేందుకు కొందరు దుండగులు ప్రయత్నించారు. అయితే వారి ప్రయత్నం విఫలం కావడంతో సమీపంలోని సూపర్ మార్కెట్‌లోకి చొరబడి అక్కడున్న సిబ్బంది, వినియోగదారులను బందీలుగా చేసుకున్నారు. ఈ ఘటనలో తొలుత సుమారు 30 మంది బందీలుగా చిక్కుకోగా, భద్రతా బలగాలు జరిపిన చర్చల ఫలితంగా ఇప్పటివరకు 10 మంది సురక్షితంగా విడుదలయ్యారు. మరో 20 మంది ఇంకా దుండగుల చెరలోనే ఉన్నట్లు సమాచారం.
వివరాలు
సాయుధ వాహనం నుంచి డబ్బును దోచుకునేందుకు దుండగుల ప్రయత్నం
మంగళవారం ఉదయం కార్టజీనాలోని లా కాస్టెల్లానా ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
నగదు తరలిస్తున్న ఓ సాయుధ వాహనం నుంచి డబ్బును దోచుకునేందుకు దుండగులు ప్రయత్నించారు.
అయితే అక్కడి భద్రతా సిబ్బంది అప్రమత్తమై పానిక్ బటన్ నొక్కడంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు.
పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో దుండగులు సమీపంలోని 'ఎక్సిటో' సూపర్ మార్కెట్‌లోకి ప్రవేశించారు.
అక్కడ విధుల్లో ఉన్న సిబ్బందితో పాటు షాపింగ్ కోసం వచ్చిన వినియోగదారులను బందీలుగా పట్టుకున్నారు.
వివరాలు
భారీగా మోహరించిన భద్రతా బలగాలు, కొనసాగుతున్న చర్చలు
సమాచారం అందుకున్న పోలీసులు, సైనిక ప్రత్యేక బలగాలు వెంటనే సూపర్ మార్కెట్‌ను చుట్టుముట్టాయి.
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పరిసర భవనాలపై స్నైపర్లను కూడా మోహరించాయి.
బందీలను సురక్షితంగా విడిపించేందుకు అధికారులు దుండగులతో చర్చలు ప్రారంభించారు.
ఈ చర్చల ఫలితంగా తొలుత ఐదుగురు వృద్ధ మహిళలను దుండగులు విడుదల చేశారు. ఆ తర్వాత మరో ఐదుగురిని కూడా విడిచిపెట్టారు.
దీంతో ఇప్పటివరకు మొత్తం 10 మంది బందీలకు విముక్తి లభించింది. అయితే ఇంకా సుమారు 20 మంది దుండగుల అదుపులోనే ఉన్నట్లు తెలుస్తోంది.
వివరాలు
స్పందించిన కొలంబియా అధ్యక్షుడు
ఈ ఘటనపై కొలంబియా అధ్యక్షుడు అబెలార్డో డి లా ఎస్ప్రియెల్లా స్పందించారు.
ఈ దాడికి పాల్పడినవారు ఉగ్రవాదులు కాదని, సాధారణ నేరస్థులేనని ఆయన స్పష్టం చేశారు.
బందీలకు న్యాయం జరుగుతుందని, అయితే నేరస్థులకు మాత్రం అంత మంచి జరగకపోవచ్చని వ్యాఖ్యానించారు.
మిగిలిన వారిని కూడా ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా సురక్షితంగా విడిపించేందుకు భద్రతా బలగాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.
మరోవైపు, ఈ ఘటనతో కార్టజీనా నగరంలో భయాందోళనలు నెలకొన్నాయి. భద్రతా కారణాల దృష్ట్యా నగరంలోని విమానాశ్రయంలో విమానాల రాకపోకలను కూడా కొద్దిసేపు నిలిపివేశారు.