Loading...
Trump on Israel aid: ఇజ్రాయెల్‌కు రూ.37 వేల కోట్ల సాయం నిలిపివేస్తాం: అమెరికా అధ్యక్షుడు ట్రంప్
ఇజ్రాయెల్‌కు రూ.37 వేల కోట్ల సాయం నిలిపివేస్తాం: అమెరికా అధ్యక్షుడు ట్రంప్

Trump on Israel aid: ఇజ్రాయెల్‌కు రూ.37 వేల కోట్ల సాయం నిలిపివేస్తాం: అమెరికా అధ్యక్షుడు ట్రంప్

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 04, 2026
08:00 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక ప్రకటన చేశారు. ఇజ్రాయెల్‌కు ఏటా అందిస్తున్న 4 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.37 వేల కోట్ల) ఆర్థిక, సైనిక సహాయాన్ని వచ్చే ఏడాది నుంచి నిలిపివేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. అయితే, మిత్రదేశమైన ఇజ్రాయెల్‌కు రక్షణ రంగానికి సంబంధించిన ఉత్పత్తులను విక్రయించడం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అమెరికాలో మధ్యంతర ఎన్నికల పోలింగ్‌ జరుగుతున్న సమయంలో ఓ మీడియా సంస్థతో టెలిఫోన్‌లో మాట్లాడిన ట్రంప్‌ ఈ విషయాలను వెల్లడించారు. సాయాన్ని నిలిపివేయాలన్న ఆలోచనపై ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు తనను సంప్రదించినట్లు తెలిపారు. గత రెండేళ్లుగా ఈ అంశంపై ఇద్దరం చర్చలు జరుపుతున్నామని చెప్పారు.

వివరాలు 

ఇజ్రాయెల్‌కు భారీ మొత్తంలో అమెరికా సైనిక సహాయం 

ఇజ్రాయెల్‌కు ఇకపై అమెరికా నుంచి ఆర్థిక సాయం అవసరం లేదని ట్రంప్‌ అభిప్రాయపడ్డారు.

''ఇజ్రాయెల్‌కు 4బిలియన్‌ డాలర్ల విలువైన పరికరాలు,నగదు అందించాం.ఇక వారికి ఆ అవసరం లేదు.అంత పెద్ద మొత్తంలో ఖర్చు చేయడం అమెరికాకు చాలా భారంగా మారింది. అమెరికా నుంచి అవసరమైన వస్తువులను కొనుగోలు చేసేందుకు ఇజ్రాయెల్‌ వద్ద తగినంత డబ్బు ఉంది''అని ఆయన పేర్కొన్నారు.

ట్రంప్‌ ప్రకటనపై నెతన్యాహు కార్యాలయం నుంచి ఎలాంటి స్పందన వెలువడలేదు.

మరోవైపు, అమెరికా కొన్నేళ్లుగా ఇజ్రాయెల్‌కు భారీ మొత్తంలో సైనిక సహాయాన్ని అందిస్తోంది.

2023లో గాజా యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇజ్రాయెల్‌కు అమెరికా దాదాపు 21.7 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.2 లక్షల కోట్లు) సైనిక సహాయం అందించినట్లు ఇటీవల ఓ అధ్యయనం వెల్లడించింది.

ADVERTISEMENT