1,500 మంది హమాస్ మిలిటెంట్లను హతమార్చాం: ఇజ్రాయెల్ మిలటరీ
తమ దేశంపై ఆకస్మిక దాడికి పాల్పడిన పాలస్తీనాకు చెందిన హమాస్ మిలిటెంట్లపై ఇజ్రాయెల్ తీవ్ర స్థాయిలో ప్రతిఘటిస్తోంది. తమ భూభాగంలో దాదాపు 1,500 మంది హమాస్ మిలిటెంట్ల మృతదేహాలు లభ్యమయ్యాయని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం నాలుగో రోజుకు చేరుకొంది. తాజాగా తమ దేశంలోని అన్ని ప్రదేశాలు పూర్తిగా మిలటరీ ఆధీనంలోకి వచ్చినట్లు సైన్యం పేర్కొంది. గత రాత్రి నుంచి హమాస్ ఉగ్రవాదులు ఎవరూ ఇజ్రాయెల్‌లోకి ప్రవేశించలేదని, అయినా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ఇజ్రాయెల్ అధికార ప్రతినిధి రిచర్డ్ హెచ్ట్ చెప్పారు. ఇరు దేశాల మధ్య యుద్దం నేపథ్యంలో ఇజ్రాయెల్‌లో 900 మంది, గాజా, వెస్ట్ బ్యాంక్‌లో 700 మంది మరణించారు.
నాలుగో రోజు ఇజ్రాయెల్‌దే పై చేయి
హమాస్ దాడి తర్వాత ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి ఘాటుగా స్పందించారు. మిలిటెంట్ గ్రూప్‌పై ప్రతీకారం తీర్చుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. అన్నట్లుగానే ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు హమాస్ కేంద్రాలపై విరుచుకుపడ్డాయి. గాజా నగరంపై ఏ మాత్రం కనికరం లేకుండా యుద్ధ విమానాలతో మూకుమ్మడిగా ఇజ్రాయెల్ దాడి చేసింది. మొదటి మూడు రోజులు హమాస్ పై చేయి సాధించినా, నాలుగో రోజు మాత్రం ఇజ్రాయెల్ సైన్యం పై చేయి సాధించింది. దశాబ్దాల ఇజ్రాయెల్ చరిత్రలో మొదటిసారిగా ఆ దేశ వీధుల్లోకి ఉగ్రవాదులు తుపాకులతో రెచ్చిపోయారు. మరో ఇజ్రాయెల్ సైన్యం 3లక్షల మందిని ఆర్మీలోకి చేర్చుకుంటోంది. ఈ క్రమంలో గాజాపై ఎదురుదాడిలో భాగంగానే ఇజ్రాయెల్ ఈ రిక్రూట్‌మెట్ చేపడుతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి.