Spain Train Accident: స్పెయిన్‌లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
ఈ వార్తాకథనం ఏంటి
స్పెయిన్‌లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. హైస్పీడ్ రైలు అదుపుతప్పి పట్టాలు దిగి, మరో హైస్పీడ్ రైలును ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో 21 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమాచారం అందగానే రైల్వే అధికారులు, సహాయక బృందాలు సంఘటనాస్థలికి చేరుకుని వెంటనే సహాయ చర్యలు ప్రారంభించారు. గాయపడిన వారిని సమీప ఆస్పత్రులకు తరలించారు. సోమవారం స్పెయిన్ దక్షిణంలోని అండలూసియా ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. హైస్పీడ్ రైలు పట్టాలు తప్పి మరో హైస్పీడ్ రైలును ఢీకొట్టడంతో నష్టం తీవ్రంగా జరిగింది. ప్రమాద స్థలంలోనే 21 మంది మృతి చెందారని, మొత్తం 73 మంది గాయపడినట్లు రైలు ఆపరేటర్ 'ఇర్యో' వెల్లడించింది.
వివరాలు
సుమారు 300 మంది ప్రయాణికులు
మాలాగా-మాడ్రిడ్ హైస్పీడ్ సర్వీస్‌లో సుమారు 300 మంది ప్రయాణికులు ఉన్నారని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై స్పెయిన్ ప్రధానమంత్రి పెడ్రో సాంచెజ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ,ఇది అత్యంత విషాదకరమైన రాత్రిగా పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం మాలాగా నుంచి మాడ్రిడ్‌కు బయలుదేరిన రైలు, ఆడమూజ్ సమీపానికి చేరుకున్న సమయంలో పట్టాలు తప్పి పక్క ట్రాక్‌పైకి వెళ్లింది. అదే సమయంలో ఎదురుగా వస్తున్న మరో హైస్పీడ్ రైలు రావడంతో ఢీకొన్న ప్రమాదం చోటుచేసుకుంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అత్యవసర సేవల అధికారి ఆంటోనియో సాన్జ్ తెలిపారు. తీవ్ర గాయాలపాలైన 30 మంది పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని తక్షణమే ఆస్పత్రులకు తరలించినట్లు రవాణా శాఖ మంత్రి ఆస్కార్ పుయెంటే వెల్లడించారు.