Loading...
Indonesia: ఇండోనేసియా క్యాండీ ఫ్యాక్టరీలో ఘోర అగ్నిప్రమాదం.. 24 మంది మృతి
ఇండోనేసియా క్యాండీ ఫ్యాక్టరీలో ఘోర అగ్నిప్రమాదం.. 24 మంది మృతి

Indonesia: ఇండోనేసియా క్యాండీ ఫ్యాక్టరీలో ఘోర అగ్నిప్రమాదం.. 24 మంది మృతి

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 24, 2026
10:18 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇండోనేషియాలో భారీ అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. వెస్ట్ జావా ప్రావిన్స్‌లోని ఓ క్యాండీ తయారీ కర్మాగారంలో మంటలు చెలరేగడంతో 24 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మరో 30 మంది ఆచూకీ తెలియకుండా పోయింది. వారి కోసం సహాయక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. వివరాల్లోకి వెళితే.. ఇండోనేసియాలోని సెరాంగ్ రీజెన్సీ పరిధిలో ఉన్న సికాండే ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. అక్కడి పీటీ ఫోనుసా అగుంగ్ ములియా క్యాండీ ఫ్యాక్టరీలో శనివారం సాయంత్రం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదం జరిగిన సమయంలో కర్మాగారంలో సుమారు 300 మంది కార్మికులు విధుల్లో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

వివరాలు 

గుర్తుపట్టలేని విధంగా కాలిపోయిన మృతదేహాలు

ఎయిర్ కండిషనర్‌లో ఏర్పడిన షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్నిప్రమాదం సంభవించి ఉండొచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నట్లు కార్మిక సమస్యలపై అధ్యక్షుడి సలహాదారు సయీద్ ఇక్బాల్ తెలిపారు.

ఈ ఘటనపై విచారణలో భాగంగా ఫ్యాక్టరీ సీఈఓను పిలిపించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ప్రమాద స్థలంలో ఇంకా కొన్ని ప్రాంతాల్లో మంటలు పూర్తిగా అదుపులోకి రాలేదని రెస్క్యూ ఏజెన్సీ అధిపతి అల్ అమ్రాద్ తెలిపారు.

భవనం నిర్మాణం కూడా బలహీనపడటంతో సహాయక చర్యలు చేపట్టడం కష్టంగా మారిందని వివరించారు.

ఇప్పటివరకు 29 మంది కార్మికులు సురక్షితంగా బయటపడగా, వారిలో ఐదుగురిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

సహాయక సిబ్బంది ఇప్పటివరకు 24 మృతదేహాలను వెలికితీశారు.

వివరాలు 

మృతుల గుర్తింపు కోసం డీఎన్ఏ పరీక్షలు నిర్వహించనున్న అధికారులు

మంటల తీవ్రత కారణంగా మృతదేహాలను నేరుగా చూసి గుర్తించడం సాధ్యం కావడం లేదని పోలీస్ అధికారిణి వాహ్ యు హిదాయతి తెలిపారు.

మృతుల కుటుంబ సభ్యుల నుంచి డీఎన్ఏ నమూనాలు సేకరించి, వాటితో పోల్చడం ద్వారా మృతుల వివరాలను నిర్ధారిస్తామని చెప్పారు.

ఈ గుర్తింపు ప్రక్రియ పూర్తయ్యేందుకు రెండు నుంచి మూడు వారాల సమయం పట్టే అవకాశం ఉందని వెల్లడించారు.

ADVERTISEMENT

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఇండోనేసియాలో ఘోర అగ్నిప్రమాదం

ADVERTISEMENT