Loading...
Washington DC: వాషింగ్టన్‌లో కాల్పులు.. ఒకరి మ‌ృతి, నలుగురికి గాయాలు
వాషింగ్టన్‌లో కాల్పులు.. ఒకరి మ‌ృతి, నలుగురికి గాయాలు

Washington DC: వాషింగ్టన్‌లో కాల్పులు.. ఒకరి మ‌ృతి, నలుగురికి గాయాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 12, 2026
10:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా రాజధాని వాషింగ్టన్‌ డీసీలో కాల్పుల ఘటన కలకలం రేపింది. ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ఒకరు ప్రాణాలు కోల్పోగా.. మరో నలుగురు గాయపడ్డారు. వైట్‌హౌస్‌కు సమీపంలోని ప్రముఖ నివాస, వాణిజ్య ప్రాంతమైన లోగన్‌ సర్కిల్‌లో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఐదుగురిపై కాల్పులు జరిపిన అనంతరం నిందితుడు సమీపంలోని ఓ అపార్ట్‌మెంట్‌ భవనంలోకి వెళ్లి దాక్కున్నట్లు సమాచారం. దీంతో పోలీసులు ఆ ప్రాంతంలో భారీగా మోహరించారు. వైట్‌హౌస్‌కు ఉత్తరంగా సుమారు ఒక మైలు దూరంలో ఉన్న 15వ స్ట్రీట్‌లో కాల్పులు జరిగాయి. ఈ నేపథ్యంలో పోలీసులు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. వాహనాల రాకపోకలను నిలిపివేయడంతో పాటు ప్రజలు అటువైపు వెళ్లకుండా హెచ్చరికలు జారీ చేశారు.

వివరాలు 

పార్కింగ్‌ గ్యారేజీలో ఉన్న లిఫ్ట్‌లో మరో వ్యక్తిపై కూడా కాల్పులు

ముందుజాగ్రత్త చర్యగా సమీపంలోని పాఠశాలలను కూడా తాత్కాలికంగా మూసివేశారు. కాల్పులు జరిగిన ప్రాంతంలో జిమ్‌, చర్చి, నివాస భవనాలు, సూపర్‌ మార్కెట్లు ఉన్నాయి.

అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. తొలుత నిందితుడు ఓ జిమ్‌లోకి చొరబడి అక్కడ ఒకరిపై కాల్పులు జరిపాడు. అనంతరం బయటకు వచ్చి మళ్లీ కాల్పులకు తెగబడ్డాడు.

సమీపంలోని పార్కింగ్‌ గ్యారేజీలో ఉన్న లిఫ్ట్‌లో మరో వ్యక్తిపై కూడా కాల్పులు జరిపి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.

ఆ తర్వాత ఓ అపార్ట్‌మెంట్‌ భవనంలోని ఏడో అంతస్తుకు చేరుకుని ఓ ఫ్లాట్‌లోకి వెళ్లి తలుపులు మూసుకున్నట్లు అనుమానిస్తున్నారు.

వివరాలు 

జిమ్‌లో 50మంది

జిమ్‌లో కాల్పులు జరిగిన సమయంలో అక్కడ సుమారు 50మంది ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షి తెలిపారు.

ఉదయం 8గంటల ప్రాంతంలో నిందితుడు కాల్పులు జరిపాడని చెప్పారు.బుల్లెట్‌ తగిలిన ఓ వ్యక్తి రక్తపు మడుగులో నేలపై కుప్పకూలిపోయాడని వివరించారు.

దీంతో ప్రాణభయంతో తాను సహా అక్కడున్నవారంతా జిమ్‌ నుంచి బయటకు పరుగులు తీశామని తెలిపారు.

జిమ్‌లో రెండు రౌండ్ల కాల్పుల శబ్దం వినిపించగా..బయట ఐదు నుంచి ఆరు రౌండ్లు పేలినట్లు చెప్పారు.

మరోవైపు నిందితుడి కోసం పోలీసులు లుక్‌ఔట్‌ నోటీసులు జారీ చేశారు.

మెట్రోపాలిటన్‌ డిపార్ట్‌మెంట్‌ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

నిందితుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.ఈ మేరకు ఎక్స్‌ వేదికగా ప్రకటన విడుదల చేశారు.

ADVERTISEMENT

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మెట్రోపాలిటన్‌ డిపార్ట్‌మెంట్‌ పోలీసులు చేసిన ట్వీట్ 

ADVERTISEMENT