గ్రీస్ తీరంలో మునిగిపోయిన పడవ: 79 మంది వలసదారులు మృతి
గ్రీస్ తీరంలో ఓవర్‌లోడ్‌తో వెళ్తున్న పడవ బోల్తా పడి మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 79మంది వలసదారులు చనిపోయారు. వందలాది మంది మునిగిపోయారు. ఇటీవలి సంవత్సరాలలో ఐరోపాలో జరిగిన అత్యంత ఘోరమైన షిప్పింగ్ విపత్తుల్లో ఇది ఒకటి. ఈ ఘటన బుధవారం తెల్లవారుజామున జరగ్గా, మునిగిపోయిన వారిని కాపాడేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ప్రమాదం సమయంలో ఓడలో సుమారు 750 మంది ఉన్నట్లు యూరోపియన్ రెస్క్యూ సపోర్ట్ ఛారిటీ చెబుతోంది. ఇప్పటి వరకు 104 మందిని ప్రాణాలతో రక్షించారు. లిబియా నుంచి పడవ బయలుదేరినట్లు చెబుతున్నారు. పడవలో ఉన్న వలసదారుల్లో ఎక్కువ మంది ఈజిప్ట్, సిరియా, పాకిస్థాన్ నుంచి వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు.
ప్రమాదంపై ఐక్యరాజ్య సమితి దిగ్భ్రాంతి
ప్రాణాలతో బయటపడిన వారిని పైలోస్ సమీపంలోని కలమాటా అనే గ్రీకు నౌకాశ్రయానికి తీసుకెళ్లారు. అక్కడ వారికి వైద్య సహాయం, తాత్కాలిక ఆశ్రయం కల్పించారు. దక్షిణ గ్రీస్‌లోని ఒక తీర పట్టణమైన పైలోస్‌కు నైరుతి దిశలో ఈ ప్రమాదం జరగ్గా, ప్రత్యేక విమానాలతో రాత్రి కూడా రెస్క్యూ ప్రయత్నాలను కొనసాగించారు. ఈ ప్రమాదంలో నేపథ్యంలో గ్రీస్ కేర్ టేకర్ ప్రభుత్వం మూడు రోజుల సంతాప దినాలను ప్రకటించింది. ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ ఈ ప్రమాదంపై స్పందించారు. ఇది చాలా భయంకరమైనదని ఆయన ట్వీట్ చేసారు. మధ్యధరా సముద్రంలో జరిగిన మరో భయంకరమైన ఓడ ప్రమాదంగా దీన్ని అభివర్ణించారు.