Thailand: థాయిలాండ్‌లో విషాద ఘటన.. బాలుడు నడిపిన వాహనం ఢీకొని 9 మంది సాధువుల మృతి
ఈ వార్తాకథనం ఏంటి
ఈశాన్య థాయిలాండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తీర్థయాత్రలో భాగంగా రహదారి పక్కన నడుచుకుంటూ వెళ్తున్న సాధువుల బృందంపై 11 ఏళ్ల బాలుడు నడుపుతున్న పికప్ ట్రక్కు అదుపుతప్పి దూసుకెళ్లడంతో తొమ్మిది మంది సాధువులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని గురువారం స్థానిక అధికారులు వెల్లడించారు. రాజధాని బ్యాంకాక్‌కు సుమారు 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముక్దహాన్ ప్రావిన్స్‌కు చెందిన 35 మంది సాధువులు రహదారికి ఒకవైపు వరుసగా ఒకరి వెనుక మరొకరు నడుచుకుంటూ తీర్థయాత్రకు వెళ్తున్నారు. ఈ సమయంలో వేగంగా వచ్చిన పికప్ ట్రక్కు అదుపు తప్పి వారి మీదకు దూసుకెళ్లడంతో క్షణాల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
వివరాలు
పోలీసుల అదుపులోకి 11 ఏళ్ల బాలుడు
ఈ ప్రమాదంలో ఐదుగురు సాధువులు ఘటనాస్థలంలోనే మృతిచెందగా, తీవ్రంగా గాయపడిన మరో నలుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. గాయాలతో చికిత్స పొందుతున్న 13 మంది సాధువుల్లో ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని అధికారులు తెలిపారు. ప్రమాదానికి కారణమైన 11 ఏళ్ల బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని ఘటనపై విచారణ కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.