Page Loader
Sana Yousuf: పాకిస్థాన్‌లో దారుణం.. సోషల్ మీడియా స్టార్‌ను ఇంట్లోనే కాల్చి చంపారు

Sana Yousuf: పాకిస్థాన్‌లో దారుణం.. సోషల్ మీడియా స్టార్‌ను ఇంట్లోనే కాల్చి చంపారు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 03, 2025
01:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

పాకిస్థాన్‌లో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, యువ కంటెంట్ క్రియేటర్ 'సనా యూసుఫ్'ను హత్య చేశారు. ఇస్లామాబాద్‌లో ఆమె నివాసంలోనే ఈఘటన చోటుచేసుకోగా, ఆమెను కలవడానికి వచ్చిన ఓ బంధువు సమీపం నుంచే కాల్పులు జరిపి ప్రాణాలు తీశాడు. దేశవ్యాప్తంగా ఈఘటన తీవ్ర కలకలం రేపుతోంది. అప్పర్ చిత్రాల్‌కు చెందిన సనా యూసుఫ్‌కి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఆమెకు నాలుగు లక్షలకిపైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. మంగళవారం ఆమె నివాసానికి వచ్చిన బంధువు, ఇంటి బయట ఆమెతో కాసేపు మాట్లాడాడు. ఆ తర్వాత లోపలికి ప్రవేశించి, ఆమెపై వెంటనే కాల్పులు జరిపాడు. రెండు బుల్లెట్లు ఆమె శరీరంలోకి దూసుకెళ్లటంతో, ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.

Details

పోలీసుల దర్యాప్తు వేగవంతం

పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు. నిందితుడి కోసం గాలింపు కొనసాగుతోంది. ఈ హత్య వెనుక వ్యక్తిగత ద్వేషం, పరువు హత్య కోణాలు ఉన్నాయా అనే దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. సమాజంపై ప్రభావం చూపిన యువ క్రియేటర్ సనా యూసుఫ్ సామాజిక కార్యకర్త కుమార్తె. ఆమె వీడియోల ద్వారా చిత్రాల్ ప్రాంత సంస్కృతి, మహిళల హక్కులు, విద్య ప్రాధాన్యత, దైనందిన జీవనశైలి గురించి అవగాహన కల్పించేది. యువతను చైతన్యం చేసే కంటెంట్‌ను రూపొందించడంలో ఆమె ముందుండేది

Details

సోషల్ మీడియాలో #JusticeForSanaYousuf ట్రెండ్

ఆమె హత్య వార్త సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున స్పందన తెచ్చింది. #JusticeForSanaYousuf అనే హ్యాష్‌ట్యాగ్‌తో ఇన్‌స్టాగ్రామ్‌, ఎక్స్‌ (ట్విటర్) వంటి వేదికలపై వందలాది పోస్టులు వెలువడుతున్నాయి. ఈ సంఘటన 2012లో తాలిబన్లు విద్యా హక్కుల కోసం పోరాడుతున్న మలాలా యూసఫ్‌జాయ్‌పై జరిపిన దాడిని గుర్తుకు తెస్తోంది. అంతేగాక, ఈ ఏడాది ప్రారంభంలో టిక్‌టాక్ వీడియోలు చేస్తున్న కారణంగా ఓ తండ్రి తన కుమార్తెను హత్య చేసిన ఘోర ఘటన కూడా దేశాన్ని ఒక్కసారిగా షాక్‌కు గురిచేసిన సంగతి మరవకూడదు.