Ayatollah Ali Khamenei: ఖమేనీపై దాడి అంటే సంపూర్ణ యుద్ధమే: అమెరికాకు ఇరాన్ ఘాటు హెచ్చరిక
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాకు ఇరాన్ తీవ్ర హెచ్చరిక జారీ చేసింది. తమ దేశ అత్యున్నత నాయకుడు అయతొల్లా అలీ ఖమేనీపై ఏదైనా దాడి జరిగితే, దానిని ఇరాన్ ప్రజలపై జరిపిన సంపూర్ణ యుద్ధంగానే పరిగణిస్తామని స్పష్టం చేసింది. ఇప్పటికే ఇరు దేశాల మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరిన తరుణంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ఆదివారం 'ఎక్స్' (X) వేదికగా స్పందించారు. ఇరాన్‌లో కొత్త నాయకత్వం అవసరమని ట్రంప్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారి తీశాయి. దీనిపై ప్రతిస్పందించిన పెజెష్కియాన్, తమ దేశంపై ఎలాంటి దాడి జరిగినా దాన్ని బలంగా ఎదుర్కొంటామని హెచ్చరించారు.
వివరాలు
5000 దాటిన మృతుల సంఖ్య
"మా దేశ గౌరవనీయ నేతపై దాడి చేయడం అంటే మొత్తం ఇరాన్ జాతితో యుద్ధానికి దిగడమే" అని ఆయన తన పోస్టులో స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా, ఇరాన్‌లో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నిరసనల్లో ఇప్పటివరకు 5,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు ఓ ఇరాన్ అధికారి వెల్లడించారు. మృతుల్లో దాదాపు 500 మంది భద్రతా బలగాల సిబ్బంది ఉన్నారని తెలిపారు. ఈ పరిస్థితులకు అమెరికానే కారణమని ఖమేనీ ఆరోపించగా, ట్రంప్ మాత్రం ఇరాన్ పాలకుల వైఫల్యాలే ఇందుకు కారణమని విమర్శిస్తున్నారు. తాజా పరిణామాలతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం మరింత ముదిరింది.