LOADING...
Pakistan: పాక్ సైన్యంపై దాడి.. మహిళా ఆత్మాహుతి బాంబర్ల పనే
పాక్ సైన్యంపై దాడి.. మహిళా ఆత్మాహుతి బాంబర్ల పనే

Pakistan: పాక్ సైన్యంపై దాడి.. మహిళా ఆత్మాహుతి బాంబర్ల పనే

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 02, 2026
11:10 am

ఈ వార్తాకథనం ఏంటి

పాకిస్థాన్‌లోని బలోచిస్థాన్‌ ప్రావిన్స్‌లో 12 వేర్వేరు ప్రాంతాల్లో భారీ దాడులకు బాధ్యత వహిస్తూ బలోచిస్థాన్‌ లిబరేషన్ ఆర్మీ (BLA) ప్రకటన విడుదల చేసింది. ఈ దాడులలో పాక్‌ సిబ్బందిపై ఆత్మాహుతి బాంబర్లుగా రెండు మహిళలు పాల్గొన్నట్లు BLA వెల్లడించింది. వీరిలో 24 ఏళ్ల ఆసిఫా మెంగల్‌ చేసిన దాడిలో పాక్‌ సిబ్బంది సహా 50 మంది మృతి చెందారని పేర్కొంది. మరో ఆత్మాహుతి దాడిలోనూ అనేక మంది ప్రాణాలు కోల్పోయినట్లు ప్రకటించింది. అయితే ఆ బాంబర్‌ పేరు తెలియజేయలేదు. BLA బలోచిస్థాన్ అంతటా భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకొని 'హీరోఫ్' పేరుతో రెండో దశ ఆపరేషన్‌ను ప్రారంభిస్తోందని ఆదివారం ప్రకటించింది.

Details

అత్మాహుతి దాడుల్లో ఇద్దరు మహిళలు

ఈ ఘటనపై పాక్‌ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మాట్లాడుతూ.. ఆత్మాహుతి దాడుల్లో ఇద్దరు మహిళా నేరస్తులు పాల్గొన్నట్లు ధృవీకరించామని చెప్పారు. బలోచిస్థాన్‌ ముఖ్యమంత్రి సర్ఫరాజ్‌ బుగతీ ఈ దాడులపై స్పందించారు. పాకిస్థాన్‌ భద్రతా దళాలు 40 గంటలుగా ఉగ్రవాదులపై చర్యలు చేపట్టినట్లుగా, ఇప్పటివరకు 140 మందికి పైగా వేర్పాటువాదులను మట్టుబెట్టినట్లు వెల్లడించారు. పాక్‌ సైన్యం తెలిపిన ప్రకారం.. స్థానిక పౌరుల వేషధారణలో ఉన్న బలోచ్‌ రెబల్స్‌ పాఠశాలలు, బ్యాంకులు, మార్కెట్లు, ఆసుపత్రులలోకి ప్రవేశించి కాల్పులు జరుపుతున్నారు. కొన్ని నగరాలు లేదా వ్యూహాత్మక స్థావరాలను స్వాధీనం చేసుకోవడానికి బలోచ్‌ రెబల్స్‌ ప్రయత్నిస్తున్నప్పటికీ, పాక్‌ భద్రతా దళాలు సమర్థవంతంగా వాటిని తిప్పికొడుతున్నాయని వివరించారు.

Advertisement