LOADING...
Israel-Iran war: పశ్చిమాసియాలో దాడులు ఉద్ధృతం.. టెహ్రాన్‌పై 50 యుద్ధవిమానాలతో ఇజ్రాయెల్ దాడి
పశ్చిమాసియాలో దాడులు ఉద్ధృతం.. టెహ్రాన్‌పై 50 యుద్ధవిమానాలతో ఇజ్రాయెల్ దాడి

Israel-Iran war: పశ్చిమాసియాలో దాడులు ఉద్ధృతం.. టెహ్రాన్‌పై 50 యుద్ధవిమానాలతో ఇజ్రాయెల్ దాడి

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 07, 2026
09:42 am

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు ఇప్పట్లో ఆరిపోయే సూచనలు కనిపించడం లేదు. ఇరాన్ సైనిక సామర్థ్యాలను పూర్తిగా నిర్వీర్యం చేయాలనే లక్ష్యంతో యూఎస్, ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తున్నాయి. దీనికి ప్రతిగా ఇరాన్ కూడా ఇజ్రాయెల్‌తో పాటు అమెరికాకు మద్దతు ఇస్తున్న పలు దేశాలపై దాడులను ముమ్మరం చేస్తోంది. దీంతో మొత్తం ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇదే సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టెహ్రాన్‌ను బేషరతుగా లొంగిపోవాలని హెచ్చరించారు. లొంగిపోతే తప్ప చర్చలు ఉండవని స్పష్టం చేశారు. అలాగే ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ఎంపికలో తన పాత్ర ఉంటే మంచిదని వ్యాఖ్యానించారు.

Details

టెహ్రాన్‌పై 50 యుద్ధవిమానాలతో దాడి

యుద్ధం ఏడో రోజైన శుక్రవారం, ఇజ్రాయెల్ సుమారు 50 యుద్ధవిమానాలతో టెహ్రాన్‌పై భారీ దాడి చేసింది. ఇరాన్ సుప్రీం లీడర్ నివాస ప్రాంగణంలో నిర్మించిన భూగర్భ బంకర్‌ను లక్ష్యంగా చేసుకొని దాన్ని ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. సంక్షోభ పరిస్థితుల్లో సుప్రీం లీడర్‌ను అత్యవసరంగా తరలించేందుకు సంవత్సరాల పాటు కృషి చేసి ఈ బంకర్ నిర్మించారని వెల్లడించింది. అందులో సీనియర్ అధికారుల సమావేశాలకు ప్రత్యేక గదులు కూడా ఉన్నాయని పేర్కొంది. ఇజ్రాయెల్ దాడులతో టెహ్రాన్ నగరంలోని పలు ప్రాంతాల్లో భూకంపం వచ్చినట్లుగా ఇళ్లు కంపించాయి. అలాగే కర్మన్షా నగరంలో కూడా భారీ పేలుళ్లు సంభవించాయి. అక్కడ పలు క్షిపణి స్థావరాలు ఉన్నట్లు తెలుస్తోంది.

Details

లెబనాన్‌లో బాంబుల వర్షం

ఇరాన్ క్షిపణి లాంచర్లలో సుమారు 40 శాతం ఇంకా చెక్కుచెదరకుండా ఉన్నాయని, వాటిని కూడా పూర్తిగా నాశనం చేస్తామని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. హెజ్‌బొల్లా తిరుగుబాటుదారులను లక్ష్యంగా చేసుకుని లెబనాన్ రాజధాని బీరుట్ శివార్లతో పాటు పలు ప్రాంతాల్లో ఇజ్రాయెల్ భారీ బాంబు దాడులు చేసింది. ముందుగా హెచ్చరికలు జారీ కావడంతో బీరుట్ పరిసర ప్రాంతాలు, దక్షిణ లెబనాన్ నుంచి 95 వేల మందికి పైగా ప్రజలు వలస వెళ్లినట్లు సమాచారం. బీరుట్‌లోని ఇరాన్ రాయబార కార్యాలయం సమీపంలో కూడా దాడులు జరిగినట్లు తెలుస్తోంది.

Advertisement

Details

ఇరాన్ నౌకలపై అమెరికా దాడులు

ఇరాన్ యుద్ధనౌకలను లక్ష్యంగా చేసుకుని అమెరికా దాడులను కొనసాగిస్తోంది. ఇరాన్ డ్రోన్ వాహక నౌక ఐరిస్ షాహిద్ బగేరీపై దాడి చేసినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. ఆ నౌక మంటల్లో చిక్కుకున్న వీడియోను 'ఎక్స్'లో పోస్ట్ చేసింది. ఈ నౌక దాదాపు రెండో ప్రపంచ యుద్ధకాలం నాటి విమానవాహక నౌక పరిమాణంలో ఉంటుందని పేర్కొంది. దీనిపై డ్రోన్ల ప్రయోగం కోసం 180 మీటర్ల రన్‌వే ఉందని వెల్లడించింది. ఒక్కసారి ఇంధనం నింపుకుంటే ఈ నౌక సుమారు 22 వేల నాటికల్ మైళ్ల దూరం ప్రయాణించగలదని తెలిపింది. తాజాగా ఇరాన్‌లోని 200 లక్ష్యాలపై దాడులు చేసినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. భూగర్భ లక్ష్యాలపై బంకర్ బస్టర్ బాంబులను కూడా వినియోగించినట్లు పేర్కొంది.

Advertisement

Details

క్షిపణులు, డ్రోన్లతో ఇరాన్ ప్రతిదాడులు

ప్రతీకారంగా ఇరాన్ దాడులను పెంచింది. భారీ **ఖొర్రమ్‌షహర్-4** క్షిపణులను కూడా వినియోగిస్తున్నట్లు సమాచారం. అమెరికా బలగాలు ఉన్న కువైట్, ఖతార్, సౌదీ అరేబియా, బహ్రెయిన్ దేశాలపై క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించింది. అయితే అక్కడ ఎంత ప్రాణనష్టం జరిగిందో ఇంకా స్పష్టత లేదు. ఖతార్‌లోని అల్ ఉదెయిద్ వైమానిక స్థావరం వైపు దూసుకొచ్చిన ఓ డ్రోన్‌ను కూల్చివేసినట్లు ఖతార్ రక్షణ శాఖ తెలిపింది. రియాధ్‌కు దక్షిణాన ఉన్న ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్‌బేస్వై పు వచ్చిన మూడు బాలిస్టిక్ క్షిపణులను అడ్డుకున్నట్లు సౌదీ అరేబియా వెల్లడించింది. రియాధ్ సమీపంలో మరో డ్రోన్‌ను ధ్వంసం చేశామని, ఖర్జ్ నగరంపైకి వచ్చిన క్రూజ్ క్షిపణిని కూడా అడ్డుకున్నామని తెలిపింది.

Details

ఇరాన్ లొంగిపోతేనే చర్చలు : ట్రంప్

ఇరాన్ దాడులతో తమ దేశంలో రెండు హోటళ్లు, ఒక నివాస భవనం దెబ్బతిన్నాయని బహ్రెయిన్ పేర్కొంది. ఇజ్రాయెల్‌పై కూడా ఇరాన్ రెండు దఫాలుగా దాడులు కొనసాగించింది. రాజధాని టెల్ అవీవ్‌లో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. ఇరాన్‌తో శాంతి చర్చలు ఉండబోవని డొనాల్డ్ ట్రంప్ సంకేతాలిచ్చారు. ఆ దేశం బేషరతుగా లొంగిపోవడం తప్ప మరే ఒప్పందానికీ తాము సిద్ధంగా లేమని స్పష్టం చేశారు. ఇరాన్ లొంగిపోతే ఆ దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి అమెరికా, తన భాగస్వామ్య దేశాలు కృషి చేస్తాయని సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. ఆయుధాలు త్యజించాలని ఇరాన్ సైన్యానికి పిలుపునిచ్చారు. తమ మాట వినకుండా యుద్ధం కొనసాగిస్తే ప్రాణనష్టం తప్పదని హెచ్చరించారు.

Details

ఇప్పటికే ఆలస్యమైంది

ఇరాన్‌తో ఒప్పందం కుదుర్చుకోవడానికి టెహ్రాన్ ప్రయత్నిస్తున్నదని, అయితే ఇప్పటికే ఆలస్యమైందని కూడా తెలిపారు. అలాగే కొత్త సుప్రీం లీడర్ ఎంపిక ప్రక్రియలో తనకు పాత్ర ఉంటే మంచిదని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. మోజ్తాబా ఖమేనీ సుప్రీం లీడర్ అయ్యే అవకాశాలపై వచ్చిన వార్తలను ఆయన తోసిపుచ్చారు. ఇరాన్ ప్రజలు తమ దేశాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఇదిలా ఉండగా, యుద్ధం ముగింపునకు తాము విజ్ఞప్తి చేయలేదని, అమెరికాతో చర్చలను ప్రతిపాదించలేదని ఈజిప్టులో ఇరాన్ రాయబారి మొజ్తాబా ఫెర్డౌసీ పౌర్ తెలిపారు.

Details

మధ్యవర్తిత్వ ప్రయత్నాలు

ప్రస్తుత ఘర్షణకు ముగింపు పలికే దిశగా కొన్ని దేశాలు మధ్యవర్తిత్వ ప్రయత్నాలు ప్రారంభించాయని ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్ వెల్లడించారు. అయితే వాటి వివరాలను ఆయన వెల్లడించలేదు. ఇరాన్‌లో కొత్త సుప్రీం లీడర్ ఎంపిక ప్రక్రియ కూడా ప్రారంభమైంది. సుప్రీం లీడర్‌ను ఎంపిక చేసే అసెంబ్లీ సమావేశం ఎలా నిర్వహించాలన్న విషయంపై నాయకత్వ మండలి చర్చించింది. ఈ మండలిలో అధ్యక్షుడు పెజెష్కియాన్, న్యాయ విభాగం అధిపతి గొలామ్ హొసీన్ మొహ్‌సెనీ ఎజెహి, మతపెద్ద ఆయతుల్లా అలీ రెజా అరాఫీ సభ్యులుగా ఉన్నారు.

Details

శ్రీలంకకు తరలించిన ఇరాన్ నావికులు

ఇంజిన్ వైఫల్యంతో సమస్యలు ఎదుర్కొంటున్న ఇరాన్ నౌక ఐరిన్స్ బుషెహర్ నుంచి 204 మంది నావికులను శ్రీలంక నౌకాదళం సురక్షితంగా కొలంబోకు తరలించింది. మరో నలుగురు నావికులు నౌకలోనే ఉన్నారు. ప్రస్తుతం కొలంబో సమీపంలో ఉన్న ఈ నౌక ట్రింకోమలీ చేరుకోవడానికి మరో రెండు రోజులు పడుతుందని అధికారులు తెలిపారు. అమెరికా ముంచేసిన యుద్ధనౌకపై ఉద్రిక్తత ఇరాన్ యుద్ధనౌక ఐరిస్ దేనాను అమెరికా ముంచేసిన ఘటనపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. దీనికి తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించింది. భారత్‌లో పర్యటిస్తున్న ఇరాన్ విదేశాంగ శాఖ ఉప మంత్రి సయీద్ ఖతీబ్జాదే ఈ మేరకు వ్యాఖ్యానించారు.

Details

కొచ్చిలో ఇరాన్ నౌకకు భారత్ అనుమతి

ఇరాన్‌కు చెందిన ఐరిస్ లావన్ నౌకను కొచ్చిలో నిలిపేందుకు భారత్ అనుమతించింది. అందులోని 183 మంది సిబ్బందికి ఆశ్రయం కల్పించింది. విశాఖపట్నంలో జరిగిన అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూకు వచ్చి తిరిగి వెళ్తుండగా సాంకేతిక సమస్యలు తలెత్తడంతో అత్యవసరంగా నిలిపేందుకు ఇరాన్ విజ్ఞప్తి చేయడంతో అనుమతి ఇచ్చినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీను హతమార్చే నిర్ణయం గతేడాది నవంబరులోనే తీసుకున్నట్లు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ వెల్లడించారు. ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఈ ఆపరేషన్‌ను వాస్తవానికి ఈ ఏడాది మధ్యలో ప్రారంభించాలనుకున్నప్పటికీ, ఇరాన్‌లో పెద్దఎత్తున నిరసనలు చెలరేగడంతో ముందుగానే ప్రారంభించినట్లు తెలిపారు.

Details

ఖతార్‌లో భారతీయులకు హెచ్చరిక

ఖతార్‌లో ఉన్న భారతీయులను అక్కడి భారత రాయబార కార్యాలయం అప్రమత్తం చేసింది. అత్యవసర పరిస్థితుల్లో సౌదీ అరేబియా మీదుగా ప్రయాణించేందుకు తాత్కాలిక ట్రాన్సిట్ వీసా సౌకర్యాన్ని కల్పించేందుకు రిజిస్ట్రేషన్ లింక్ అందుబాటులో ఉంచింది. ఖతార్ నుంచి సౌదీకి వెళ్లేందుకు సాల్వా భూసరిహద్దు మార్గం ప్రస్తుతం తెరిచి ఉందని తెలిపింది.

Details

 అమెరికాకు సమాచారం ఇవ్వలేదు : భారత్

ఇరాన్ యుద్ధనౌక ఐరిస్ దేనాకు సంబంధించి అమెరికాకు తాము ఎలాంటి నిఘా సమాచారం ఇవ్వలేదని భారత నౌకాదళ వర్గాలు స్పష్టం చేశాయి. తమపై వస్తున్న ఆరోపణలు నిరాధారమని పేర్కొన్నాయి. అంతర్జాతీయ మానవ సహాయ ఒప్పందాల మేరకు శ్రీలంక నౌకాదళంతో కలిసి సహాయక చర్యల్లో పాల్గొన్నామని తెలిపారు. యుద్ధంలో 200 మంది చిన్నారుల మృతి ప్రస్తుతం కొనసాగుతున్న యుద్ధంలో ఇప్పటివరకు దాదాపు 200 మంది చిన్నారులు మృతి చెందినట్లు UNICEF వెల్లడించింది. వీరిలో 181 మంది ఇరాన్‌లో, ఏడుగురు లెబనాన్‌లో, ముగ్గురు ఇజ్రాయెల్‌లో మరణించినట్లు తెలిపింది.

Advertisement