LOADING...
West Asia: పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. యూఏఈపై 12 క్షిపణుల దాడి
పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. యూఏఈపై 12 క్షిపణుల దాడి

West Asia: పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. యూఏఈపై 12 క్షిపణుల దాడి

వ్రాసిన వారు Sirish Praharaju
May 05, 2026
08:10 am

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమాసియా ప్రాంతంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. యూఏఈలోని పుజైరా చమురు కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్‌ డ్రోన్ దాడులకు పాల్పడినట్లు సమాచారం. క్షతగాత్రుల్లో ముగ్గురు భారతీయులు ఉన్నట్లు సమాచారం. శత్రు స్థావరాలను ధ్వంసం చేస్తామని ఐఆర్‌జీసీ హెచ్చరించిన కొద్దిసేపటికే ఈ దాడులు జరగడం గమనార్హం. గల్ఫ్ ప్రాంతమంతా ఉద్రిక్తతతో మార్మోగుతోంది. ఇరాన్‌ క్షిపణులు, డ్రోన్లు, చిన్న పడవలను వినియోగిస్తూ దాడులకు దిగినట్లు సమాచారం. అయితే యూఏఈ రక్షణ వ్యవస్థలు 12 బాలిస్టిక్ క్షిపణులు, 3 క్రూయిజ్ క్షిపణులు, 4 డ్రోన్లను అడ్డుకున్నాయి. ఈ ఘటనల్లో పలువురు గాయపడ్డారు. అదే సమయంలో పర్షియన్ గల్ఫ్ తీరంలోని ముసందం గవర్నరేట్ పరిధిలోని బుఖా ప్రాంతంలో కార్మికుల నివాస భవనం దెబ్బతింది.

వివరాలు 

ఇటు హర్ముజ్‌లోనూ..

ఈ దాడిలో ఇద్దరు విదేశీయులు గాయపడ్డారు. ఈ ఘటనలను యూరోపియన్ యూనియన్, సౌదీ అరేబియా తీవ్రంగా ఖండించాయి. పరిస్థితుల దృష్ట్యా యూఏఈ తమ విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేసింది. ఇక హర్ముజ్ జలసంధి వద్ద కూడా పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఇరాన్‌ దాడులు అమెరికా రక్షణలో ఉన్న నౌకలను లక్ష్యంగా చేసుకున్నట్లు సమాచారం. అయితే తమ నౌకలు సురక్షితంగా ఉన్నాయని అమెరికా కేంద్ర కమాండ్ ప్రకటించింది. ఈ దాడుల్లో దక్షిణ కొరియాకు చెందిన ఒక వాణిజ్య నౌక మంటల్లో చిక్కుకుంది. ఈ ఉద్రిక్తతల ప్రభావంతో వందలాది నౌకలు హర్ముజ్ వద్దే నిలిచిపోయాయి. వాటిని సురక్షితంగా బయటకు తీసుకురావడానికి అమెరికా రక్షణ చర్యలు చేపడుతోంది.

వివరాలు 

ట్రంప్ ఏమన్నారంటే..

ఇరాన్‌ తాజా చర్యలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. అమెరికా నౌకలపై లేదా తమ రక్షణలో ఉన్న నౌకలపై దాడులు చేసిన వారిని కఠినంగా ఎదుర్కొంటామని హెచ్చరించారు. కాల్పుల విరమణ కొనసాగుతోందా అనే ప్రశ్నకు ఆయన స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. అయితే యుద్ధం సైనికంగా ముగిసిందని వ్యాఖ్యానించారు. మరోవైపు యూఏఈపై దాడులకు తామే కారణమని ఇరాన్‌ అధికారికంగా ఒప్పుకోలేదు. ఆ దేశ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి స్పందిస్తూ ఈ ఉద్రిక్తతలకు సైనిక పరిష్కారం కాదని, రాజకీయ పరిష్కారమే అవసరమని అభిప్రాయపడ్డారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఇజ్రాయెల్ అప్రమత్తమైంది. గల్ఫ్ దేశాల్లో కాల్పులు,హెచ్చరికలు కొనసాగుతుండగా కాల్పుల విరమణ బలహీనపడింది. దీంతో ఎప్పుడు ఏమి జరుగుతుందోననే అనిశ్చితి గల్ఫ్ ప్రాంతాన్ని ఆవరించింది.

Advertisement