LOADING...
Donald Trump: హర్మూజ్ వద్ద యుద్ధ నౌకలు పంపాలన్న ట్రంప్ విజ్ఞప్తి.. ఆస్ట్రేలియా, జపాన్ నో
హర్మూజ్ వద్ద యుద్ధ నౌకలు పంపాలన్న ట్రంప్ విజ్ఞప్తి.. ఆస్ట్రేలియా, జపాన్ నో

Donald Trump: హర్మూజ్ వద్ద యుద్ధ నౌకలు పంపాలన్న ట్రంప్ విజ్ఞప్తి.. ఆస్ట్రేలియా, జపాన్ నో

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 16, 2026
11:58 am

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావంతో హర్మూజ్ జలసంధి వద్ద ఇంధన రవాణా తీవ్ర అంతరాయానికి గురవుతోంది. అమెరికా, ఇజ్రాయెల్‌కు చెందిన నౌకలు వెళ్లకుండా హర్మూజ్ మార్గాన్ని మూసివేశామని ఇరాన్ ప్రకటిస్తోంది. ఇలాంటి కీలక సమయంలో అక్కడ భద్రతను పెంచాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన విజ్ఞప్తికి మిత్రదేశాల నుంచి ఆశించిన మద్దతు లభించడం లేదు. ఇరాన్ యుద్ధ ప్రభావంతో దెబ్బతిన్న హర్మూజ్ మార్గాన్ని సురక్షితంగా ఉంచడంతో పాటు, ఆ ప్రాంతంలో ఇంధన రవాణాను క్రమబద్ధీకరించేందుకు యుద్ధ నౌకలను పంపాలని ట్రంప్ ఏడు దేశాలను కోరినట్లు సమాచారం. అయితే ఈ పిలుపును ఇప్పటికే ఆస్ట్రేలియా, జపాన్ తిరస్కరించాయి.

వివరాలు 

హర్మూజ్ ప్రాంతానికి తాము ఎలాంటి నౌకలు పంపం: ఆస్ట్రేలియా 

హర్మూజ్ ప్రాంతానికి తాము ఎలాంటి నౌకలను పంపబోమని ఆస్ట్రేలియా స్పష్టం చేసింది. జపాన్ కూడా ఇదే తరహా వైఖరిని వ్యక్తం చేసింది. సముద్ర భద్రతా ఆపరేషన్లలో పాల్గొనే అంశాన్ని ప్రస్తుతం పరిగణనలోకి తీసుకోవడం లేదని జపాన్ తెలిపింది. మరోవైపు, యుద్ధ నౌకలను పంపించే విషయంలో అమెరికాతో ముందుగా చర్చలు జరిపిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని దక్షిణకొరియా వెల్లడించింది.

వివరాలు 

చైనాకే ఎక్కువ ప్రయోజనాలు

ఆదివారం ఎయిర్‌ఫోర్స్ వన్ విమానంలో మీడియాతో మాట్లాడిన ట్రంప్, పశ్చిమాసియా చమురుపై ఆధారపడిన దేశాలు హర్మూజ్ భద్రత కోసం ముందుకు రావాల్సిన అవసరం ఉందని ఒత్తిడి చేసినట్లు చెప్పారు. అయితే ఆయన ఆ దేశాల పేర్లను వెల్లడించలేదు. ఈ ప్రాంతంలో చైనాకే ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయని కూడా వ్యాఖ్యానించారు. కానీ హర్మూజ్ రక్షణ కోసం ఏర్పడే ఏదైనా కూటమిలో చైనా చేరుతుందా లేదా అన్న అంశంపై మాత్రం ఆయన స్పష్టత ఇవ్వలేదు.

Advertisement