రష్యా మధ్యవర్తిత్వంతో.. అజర్‌బైజాన్, అర్మేనియా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం
అజర్‌బైజాన్, అర్మేనియా దేశాల మధ్య రెండు రోజులుగా యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. వివాదానికి కేంద్రమైన నాగర్నో-కారబఖ్‌లో రెండు దేశాలు భీకర దాడులకు దిగాయి. అయితే ఇరు దేశాల మధ్య ఎట్టకేలకు కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. ఈ మేరకు అర్మేనియా వర్గాలు వెల్లడించాయి. రష్యా బృందం మధ్యవర్తిత్వం వల్ల కాల్పుల విరమణ ఒప్పందం జరిగినట్లు తెలుస్తోంది. అజర్‌బైజన్, అర్మేనియా దేశాల మధ్య భీకర దాడుల కారణంగా ఈ రెండు రోజుల్లోనే దాదాపు వంద మందికి పైగా మృతి చెందినట్లు, వేలాది మంది గాయపడినట్లు అర్మేనియన్ వార్తా సంస్థలు తెలిపాయి.
1994 నుంచి ఆధిపత్య పోరు
నాగర్నో-కారబఖ్ ప్రాంతంలో అర్మేనియన్లను వెళ్లగొట్టేందుకు అజర్‌బైజన్ ఈ దాడులు చేస్తున్నట్లు వెల్లడించాయి. అయితే అజర్‌బైజన్ దేశం అందుకు భిన్నంగా వాదిస్తోంది. ఎవరిని వెల్లగొట్టడం లేదని, ఇది ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ అని అజర్‌బైజన్ వాదిస్తోంది. అర్మేనియన్ ప్రజల హక్కులను రక్షించడానికే ఈ దాడులను చేస్తున్నట్లు పేర్కొంది. నాగర్నో- కరబఖ్ ప్రాంతం భౌగోళికంగా అజర్‌బైజన్ దేశంలో ఉంది. అయితే అజర్‌బైజన్‌ను వ్యతిరేకించే ఆర్మేనియా సైన్యం 1994 నుంచి నాగర్నో- కరబఖ్ ప్రాంతంపై ఆధిపత్యం చెలాయిస్తోంది. ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఇరు దేశాల మధ్య తరుచూ కాల్పులు జరగడం ఇక్కడ పరిపాటిగా మారింది.