LOADING...
Bangladesh: ఆరోగ్యం క్షీణించినా బెయిల్‌ నిరాకరణ.. కస్టడీలో హిందూ నేత మృతి
ఆరోగ్యం క్షీణించినా బెయిల్‌ నిరాకరణ.. కస్టడీలో హిందూ నేత మృతి

Bangladesh: ఆరోగ్యం క్షీణించినా బెయిల్‌ నిరాకరణ.. కస్టడీలో హిందూ నేత మృతి

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 08, 2026
01:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

బంగ్లాదేశ్‌లో మైనార్టీ వర్గానికి చెందిన హిందువులు ఎదుర్కొంటున్న ఇబ్బందికర పరిస్థితులకు మరో ఉదాహరణ తాజాగా వెలుగులోకి వచ్చింది. అధికార అవామీ లీగ్‌కు చెందిన మాజీ నాయకుడు, విద్యావేత్త, మాజీ మంత్రి అయిన రమేషన్‌ చంద్ర సేన్‌ (86) పోలీసు కస్టడీలోనే ప్రాణాలు కోల్పోయారు. పార్లమెంటేరియన్‌గా, విద్యారంగంలో దశాబ్దాల పాటు సేవలందించిన సేన్‌ గత 18 నెలలుగా జైలులోనే ఉన్నారు. ఈ దీర్ఘకాల నిర్బంధం కారణంగా ఆయన ఆరోగ్యం తీవ్రంగా క్షీణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. జైలులో ఉన్న సమయంలో తన ఆరోగ్యం రోజు రోజుకు బలహీనమవుతోందని పలుమార్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లినప్పటికీ, ఆయనకు బెయిల్‌ మాత్రం లభించలేదని పేర్కొన్నారు.

 Details

దాదాపు ఏడాదిన్నర పాటు జైల్లోనే

దాదాపు ఏడాదిన్నర పాటు జైల్లో ఉన్నా, సేన్‌పై బంగ్లాదేశ్ ప్రజల్లో అభిమానంలో ఏమాత్రం తగ్గుదల రాలేదని తెలుస్తోంది. విద్యారంగం, రాజకీయాల్లో ఆయన చేసిన సేవలు ప్రజల మదిలో ఇప్పటికీ నిలిచిపోయాయని స్థానికులు చెబుతున్నారు. సుమారు 18 నెలల క్రితం జరిగిన ఒక ఘటనలో, ఓ అల్లరిమూక సేన్‌పై దాడి చేయగా, దాడి చేసిన వారిని కాకుండా పోలీసులే సేన్‌ను అదుపులోకి తీసుకున్నారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆయన అరెస్ట్‌కు గల స్పష్టమైన కారణాలను కూడా అధికారులు వెల్లడించలేదని తెలిపారు. అప్పటి నుంచిఆయన నిరంతరం జైలులోనే ఉన్నారు. ఒక కేసు నుంచి బెయిల్‌పై బయటకు వచ్చే పరిస్థితి ఏర్పడిన ప్రతిసారీ, మరో కొత్త కేసును ఆయనపై మోపుతూ నిర్బంధాన్ని కొనసాగించారని సేన్‌ కుటుంబం ఆరోపించింది.

Details

వరుస కేసులతో జైలులోనే ఉంచారు

ఈ విధంగా వరుస కేసులతో ఆయనను జైలులోనే ఉంచారని వాపోయారు. ఇటీవల కాలంలో సేన్‌ ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారింది. వైద్య చికిత్స అత్యవసరంగా అవసరమైన స్థితికి చేరుకున్నప్పటికీ, తగిన వైద్యం అందలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. శనివారం రాత్రి ఆయన పరిస్థితి తీవ్రంగా విషమించడంతో, కస్టడీలోనే తుదిశ్వాస విడిచారు. ఇదే తరహాలో ఈ ఏడాది జనవరి 11న కూడా అవామీ లీగ్‌కు చెందిన హిందూ నేత ప్రళయ్‌ చాకీ పోలీసు కస్టడీలోనే మృతి చెందిన విషయం గమనార్హం. ఈ ఘటనలు బంగ్లాదేశ్‌లో మైనార్టీల భద్రతపై మరింత ఆందోళనకు దారితీస్తున్నాయి.

Advertisement