Loading...
Balochistan Home Minister: బలోచిస్థాన్‌ హోంమంత్రి కాన్వాయ్‌పై దాడి.. భద్రతా సిబ్బంది మృతి
బలోచిస్థాన్‌ హోంమంత్రి కాన్వాయ్‌పై దాడి.. భద్రతా సిబ్బంది మృతి

Balochistan Home Minister: బలోచిస్థాన్‌ హోంమంత్రి కాన్వాయ్‌పై దాడి.. భద్రతా సిబ్బంది మృతి

వ్రాసిన వారు Moogati Shabari
Aug 14, 2026
05:41 pm

ఈ వార్తాకథనం ఏంటి

బలోచిస్థాన్‌ హోంమంత్రి మీర్ జియావుల్లా కాన్వాయ్‌పై సాయుధ దుండగులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు భద్రతా సిబ్బంది మృతి చెందగా.. మరో ఆరుగురు గాయపడ్డారు. అయితే హోంమంత్రి మీర్ జియావుల్లా సురక్షితంగా బయటపడ్డారు. గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మీర్ జియావుల్లా కలత్ ప్రాంతం నుంచి క్వెట్టాకు వెళ్తుండగా ఈ దాడి జరిగింది. ఖడ్కోచా గోరు ప్రాంతంలో కొందరు సాయుధ దుండగులు ఆయన కాన్వాయ్‌ను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారు. ఈ దాడిలో కాన్వాయ్‌లోని పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. పాకిస్థాన్‌ స్వాతంత్ర్య దినోత్సవం రోజే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.

వివరాలు

పాకిస్థాన్‌ ప్రభుత్వం ఉగ్రవాద సంస్థగా ప్రకటన..

దాడికి ఇప్పటివరకు ఏ ఉగ్రవాద సంస్థా బాధ్యత ప్రకటించలేదు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు స్థానిక పోలీసులు తెలిపారు.

నిందితుల కోసం గాలింపు కొనసాగుతోందని.. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

ఈ దాడి వెనుక బలోచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) హస్తం ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

బలోచిస్థాన్‌లోని వేర్పాటువాద సంస్థ బీఎల్‌ఏ దశాబ్దాలుగా స్వయంప్రతిపత్తి కోసం డిమాండ్ చేస్తోంది.

అలాగే తమ ప్రాంతంలోని సహజ వనరులపై తమకే నియంత్రణ ఉండాలని కోరుతోంది.

ఈ క్రమంలో సైన్యం, పారామిలటరీ బలగాలు, ఇతర ప్రభుత్వ సంస్థలను లక్ష్యంగా చేసుకుని తరచూ దాడులకు పాల్పడుతోంది.

బీఎల్‌ఏను పాకిస్థాన్‌ ప్రభుత్వం ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది.

ADVERTISEMENT