Bangladesh: షేక్ హసీనాను భారత్ అప్పగించకపోతే అంతర్జాతీయ కోర్టుకు వెళ్తాం: బంగ్లాదేశ్
ఈ వార్తాకథనం ఏంటి
షేక్ హసీనాను భారత్ తమకు అప్పగించకపోతే అంతర్జాతీయ న్యాయస్థానాన్ని (ఐసీజే) ఆశ్రయిస్తామని బంగ్లాదేశ్ పార్లమెంట్ స్పీకర్ హఫీజ్ ఉద్దీన్ అహ్మద్ వెల్లడించారు. పాకిస్థాన్‌లో ఆరు రోజుల పర్యటనలో ఉన్న ఆయన గురువారం ఇస్లామాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. భారత్ తమ విజ్ఞప్తికి స్పందించకపోతే అంతర్జాతీయ న్యాయస్థానానికి వెళ్తామని స్పష్టం చేశారు. ఒకవేళ హసీనా తిరిగి ఢాకాకు వస్తే వెంటనే అరెస్టు చేసి జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. ఈ విషయాన్ని బీబీసీ ఉర్దూ వెల్లడించింది.
వివరాలు
హసీనా రాక ప్రకటనతో మొదలైన వివాదం
2024లో అధికారాన్ని కోల్పోయిన తర్వాత షేక్ హసీనా భారత్‌లోని న్యూఢిల్లీలో ఉంటున్నారు.
డిసెంబర్ 16న తిరిగి బంగ్లాదేశ్‌కు వస్తానని ఆమె ప్రకటించారు. ఈ తేదీకి అక్కడ ప్రత్యేక ప్రాధాన్యం ఉంది.
1971లో జరిగిన బంగ్లాదేశ్ విముక్తి పోరాటం ముగిసిన రోజును విజయ్ దివస్‌గా (విజయ దినోత్సవం) జరుపుకుంటారు.
అయితే హసీనా తిరిగి రావాలన్న ప్రకటనపై ప్రస్తుత బంగ్లాదేశ్ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది.
ఆమె రాకను అంగీకరించాలంటే చట్టపరమైన ప్రక్రియ ద్వారా భారత్ ఆమెను అప్పగించాల్సిందేనని స్పష్టం చేసింది.
వివరాలు
1971లో బంగ్లాదేశ్ పరిస్థితికి భారత్ కారణమంటూ వ్యాఖ్యలు
హసీనా తిరిగి వస్తానని ప్రకటించడం కేవలం తన పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపేందుకేనని, ఆమె బంగ్లాదేశ్‌కు రారని హఫీజ్ ఉద్దీన్ అహ్మద్ వ్యాఖ్యానించారు.
1971 విముక్తి పోరాట సమయంలో పాకిస్థాన్‌ను బలహీనపర్చడంలో భారత్ పాత్ర ఉందని ఆరోపిస్తూ విమర్శలు చేశారు.
ఆ సమయంలో బెంగాలీలకు భారత్ సహాయం చేయలేదని అన్నారు.
గత 15 ఏళ్లలో బంగ్లాదేశ్ పొరుగు దేశానికి వలస ప్రాంతంగా మారిపోయిందని, దీనివల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆరోపించారు.
వివరాలు
హసీనాపై బంగ్లాదేశ్ ప్రభుత్వ ఆగ్రహం
మరోవైపు ఢాకాలో హసీనాపై బంగ్లాదేశ్ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
విదేశాంగ శాఖ సహాయ మంత్రి హుమాయున్ కబీర్ మీడియా సమావేశంలో ఆమెను ఉగ్రవాదిగా అభివర్ణించారు.
హసీనాకు భారత్ ఆశ్రయం కల్పించడం వల్ల ఎదురవుతున్న ఇబ్బందులు ఇప్పుడు ఆ దేశానికి అర్థమవుతున్నాయని వ్యాఖ్యానించారు.
ఇంటికి ఒకరిని ఆహ్వానించిన తర్వాత వారు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ, అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తుంటే బయటకు పంపలేక భరించాల్సిన పరిస్థితి ఎదురవుతుందని అన్నారు.
ప్రస్తుతం భారత్‌కు కూడా ఇలాంటి సమస్యే ఎదురవుతోందని ఆయన వ్యాఖ్యానించారు.
వివరాలు
గైర్హాజరీలోనే విచారణ.. హసీనాకు మరణశిక్ష
హసీనాను అప్పగించాలని బంగ్లాదేశ్ చేసిన విజ్ఞప్తిని పరిశీలిస్తున్నామని భారత విదేశాంగ శాఖ బుధవారం వెల్లడించింది.
దీనిపై ఇప్పటికే ఉన్న విధివిధానాల ప్రకారం చర్యలు కొనసాగుతున్నాయని తెలిపింది.
అయితే ఆమె స్వచ్ఛందంగా తిరిగి వెళ్లడం అనేది వేరే విషయమని స్పష్టం చేసింది.
ఒకవేళ హసీనా బంగ్లాదేశ్‌కు వస్తే చేతులకు సంకెళ్లు వేసి అదుపులోకి తీసుకుంటారా? అన్న ప్రశ్నకు భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందించారు.
ఇది హసీనాకు, ప్రస్తుత బంగ్లాదేశ్ ప్రభుత్వానికి మధ్య ఉన్న అంశమని చెప్పారు.
కాగా, 2024 జులైలో జరిగిన తిరుగుబాటు సమయంలో మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై హసీనాపై బంగ్లాదేశ్‌లో ఆమె గైర్హాజరీలోనే విచారణ జరిగింది.
ఈ కేసులో ఆమెకు మరణశిక్ష విధించారు.