Bangladesh elections: ఖుల్నాలో పోలింగ్ కేంద్రం దగ్గర ఘర్షణ.. బీఎన్‌పీ నాయకుడు మొహిబుజ్జమాన్ కోచి మృతి
ఈ వార్తాకథనం ఏంటి
బంగ్లాదేశ్‌లో గురువారం (ఫిబ్రవరి 12) ఎన్నికల పోలింగ్ జరుగుతున్న సమయంలో ఖుల్నా నగరంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఖుల్నా సదర్ పరిధిలోని ఖుల్నా ఆలియా మద్రసా అకడమిక్ భవనంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం వద్ద ఉదయం సుమారు 8 గంటల సమయంలో ప్రత్యర్థి రాజకీయ వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనగా, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ)కి చెందిన స్థానిక నాయకుడు మొహిబుజ్జమాన్ కోచి (55) మృతి చెందినట్లు సమాచారం. హాజీ మొహ్సిన్ రోడ్ ప్రాంతానికి చెందిన కోచి, ఖుల్నా సిటీ బీఎన్‌పీ మాజీ ఆఫీస్ సెక్రటరీగా పని చేశారు. జమాత్-ఎ-ఇస్లామీకి చెందిన కార్యకర్తలతో జరిగిన వాగ్వాదం సమయంలో కోచిని తోసివేయడంతో చెట్టుకు తల తగిలి మృతి చెందినట్లు బీఎన్‌పీ నేతలు తెలిపారు.
వివరాలు
కోచి మృతి ఘటనపై పరస్పర ఆరోపణలు
ఖుల్నా సదర్ థానా బీఎన్‌పీ మాజీ ఆర్గనైజింగ్ సెక్రటరీ యూసుఫ్ హారున్ మజ్నుమాట్లాడుతూ, ఉదయం నుంచే పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొందని,అక్కడి ఆలియా మద్రసా ప్రిన్సిపాల్ జమాత్ తరఫున ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అయితే జమాత్-ఎ-ఇస్లామీ ఈ ఆరోపణలను ఖండించింది.బీఎన్‌పీ కార్యకర్తలు తమ మహిళా కార్యకర్తలను పోలింగ్ కేంద్రం నుంచి బలవంతంగా పంపించే ప్రయత్నం చేశారని,అడ్డుకున్న సమయంలో కోచి అస్వస్థతకు గురయ్యాడని,శారీరక దాడి జరగలేదని జమాత్ కేంద్ర డైరెక్టర్ మహబూబుర్ రహ్మాన్ తెలిపారు. ఇదే విషయాన్నిఆలియా మద్రసా ప్రిన్సిపాల్ అబ్దుర్ రహీం మియా కూడా సమర్థిస్తూ,గందరగోళాన్ని ఆపేందుకు మాత్రమే తాను జోక్యం చేసుకున్నానని,ఎవ్వరినీ తోసివేయలేదని చెప్పారు. కోచి మృతి ఘటనపై పరస్పర ఆరోపణల మధ్య నిజానిజాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.