LOADING...
Bangladesh:హసీనాకు మరణశిక్ష.. బంగ్లాదేశ్‌లో అల్లర్లు; ఇద్దరు మృతి
హసీనాకు మరణశిక్ష.. బంగ్లాదేశ్‌లో అల్లర్లు; ఇద్దరు మృతి

Bangladesh:హసీనాకు మరణశిక్ష.. బంగ్లాదేశ్‌లో అల్లర్లు; ఇద్దరు మృతి

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 18, 2025
10:15 am

ఈ వార్తాకథనం ఏంటి

బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా కు అక్కడి 'ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్'(ICT) విధించిన మరణదండనను వ్యతిరేకిస్తూ..ఆమె మద్దతుదారులు పెద్ద ఎత్తున తిరుగుబాట్లకు దిగడంతో పరిస్థితులు వేడెక్కాయి. ఈ అల్లర్లలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డట్లు సమాచారం. ఐసీటీ తీర్పుకు నిరసనగా దేశవ్యాప్తంగా రెండురోజుల స్తంభనకు పిలుపునిస్తూ అవామీ లీగ్‌ బంద్‌ను ప్రకటించింది. అదే సమయంలో యూనస్‌ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం అశాంతి ప్రాంతాల్లో అదనపు పోలీసు బలగాలను మోహరించింది. హసీనా తండ్రి ముజిబుర్ రెహమాన్ నివాసం ఉన్న ధన్మొండి 32 సహా అనేక ప్రదేశాల్లో ఆమె మద్దతుదారులు మార్గాలను దిగ్బంధించి,నివాసాలు.. దుకాణాలపై రాళ్ల దాడులు జరపడంతో, వారిని చెదరగొట్టడానికి పోలీసులు సౌండ్ గ్రెనేడ్లు, టియర్ గ్యాస్ వినియోగించినట్లు అధికారులు తెలిపారు.

వివరాలు 

తీర్పును తీవ్రంగా ఖండించిన  హసీనా 

నిరసనకారులపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేయడం వల్ల మరింత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విద్యార్థి ఉద్యమాల నేపథ్యంలో ప్రధాని పదవి కోల్పోయిన హసీనా,గత ఏడాది ఆగస్టులో బంగ్లాదేశ్‌ నుండి భారత్‌కు వచ్చి,అప్పటి నుంచి దిల్లీలోని ఓ రహస్య ప్రదేశంలో ఉంటున్నారు. స్వదేశంలో జరిగిన ఆందోళనలకు ఆమె కారణమన్న ఆరోపణలతో మానవత్వానికి వ్యతిరేక నేరాలపై కేసులు నమోదయ్యాయి. వాటిని విచారించిన ఐసీటీ సోమవారం ఆమెను దోషిగా ప్రకటించి మరణ శిక్ష విధించింది. ఈ తీర్పును హసీనా తీవ్రంగా ఖండించారు.ప్రజాస్వామ్య పద్ధతులకు విరుద్ధంగా ఏర్పడిన ప్రభుత్వం కుట్రపూరితంగా ఈ నిర్ణయం తీసుకుందంటూ విమర్శించారు. తనకు అన్యాయంగా శిక్ష పడినందుకు దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.అందుకే అవామీ లీగ్ మంగళవారం దేశవ్యాప్తంగా బంద్‌కు పిలుపునిచ్చింది.