Bangladesh: భారత్ లాంటి స్నేహితుడు ఉండటం మా అదృష్టం: బంగ్లాదేశ్ ప్రధాని హసీనా
ఈ వార్తాకథనం ఏంటి
బంగ్లాదేశ్‌లో ఆదివారం పార్లమెంట్ ఎన్నికల కోసం పోలింగ్ జరుగుతోంది.
ఈ క్రమంలో తన ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం ప్రధాన మంత్రి షేక్ హసీనా భారత్‌ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు.
భారత్‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఇండియా వంటి నమ్మకమైన స్నేహితుడిని కలిగి ఉండటం బంగ్లాదేశ్ అదృష్టమని అన్నారు.
1971లో జరిగిన బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంలో భారత్ ఇచ్చిన మద్దతును కూడా ఈ సందర్భంగా ఆమె గుర్తు చేసుకున్నారు.
యుద్ధం సమయంలో తన కుటుంబం ఊచకోతకు గురైందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆ సమయంలో అనేక ఏళ్లుగా భారతదేశంలో ఆశ్రయం పొందినట్లు పేర్కొన్నారు.
ఇండియా నుంచి బంగ్లాదేశ్‌కు తిరిగి వచ్చిన షేక్ హసీనా.. అవామీ లీగ్ పార్టీ అధ్యక్ష బాధ్యతలను స్వీకరించారు.
బంగ్లాదేశ్
ప్రజాస్వామ్యం లేకుండా ఎటువంటి అభివృద్ధి చేయలేరు: షేక్ హసీనా
బంగ్లాదేశ్ దేశాభివృద్ధికి ప్రజాస్వామ్యం ప్రాముఖ్యతను షేక్ హసీనా నొక్కి చెప్పారు.
గత సంవత్సరాల్లో తమ ప్రభుత్వం ప్రజల ప్రజాస్వామ్య హక్కులను స్థాపించిందని అన్నారు.
ఈ దేశంలో ప్రజాస్వామ్యం కొనసాగాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పారు.
ప్రజాస్వామ్యం లేకుండా ఎటువంటి అభివృద్ధి చేయలేరని ప్రధాని అన్నారు.
2009-2023 మధ్య కాలంలో బంగ్లాదేశ్ దీర్ఘకాలిక ప్రజాస్వామ్య వ్యవస్థను సాధించినట్లు పేర్కొన్నారు.
ప్రజలు బయటకు వచ్చి ఓటు వేయగలిగే వాతావరణాన్ని తమ ప్రభుత్వం సృష్టించిందని హసీనా నొక్కిచెప్పారు.
బంగ్లాదేశ్ ప్రతిపక్ష పార్టీ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) దేశంలో హింసను ప్రేరేపిస్తోందని, వారు ప్రజల అభివృద్ధికి వ్యతిరేకమని ఆమె ఆరోపించారు.
బంగ్లాదేశ్
ప్రతిపక్షాలకు ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదు: ప్రధాని
బీఎన్‌పీ, జమాత్‌లు రైలు తగులబెట్టడం, వాహనాలను తగలబెట్టడం వంటి అనేక హింసాత్మక సంఘటనలకు పాల్పడ్డాయని, వారికి ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదని ప్రధాని హసీనా అన్నారు.
వారు దేశభక్తులు కాదని, ప్రజాస్వామ్యాన్ని వ్యతిరేకిస్తున్నారని ఆమె అన్నారు.
ప్రజల అభివృద్ధి, ప్రజాస్వామ్యం కొనసాగడం వారికి ఇష్టం లేదని స్పష్టం చేసారు.
హసీనా రాజీనామాను డిమాండ్ చేస్తూ ప్రధాన ప్రతిపక్షమైన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఎన్నికలను బహిష్కరించింది.
ఈ క్రమంలో బంగ్లాదేశ్‌లోని దాదాపు 170 మిలియన్ల మంది ప్రజలు 299 మంది శాసనసభ్యులను ఎన్నుకునేందుకు ఆదివారం ఓటు వేస్తున్నారు.
ఆదివారం నాటి ఎన్నికల కోసం 42,000 కంటే ఎక్కువ పోలింగ్ స్టేషన్‌లు ఏర్పాటు చేశారు.